BRS Harish Rao: సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇచ్చిందని అందులో 2లక్షల రూపాయల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారని ఇప్పుడేమో సన్నవడ్లకు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగా ఎగవేస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ బోనస్ హామీ ఒక బోగస్ హామీగా మారిపోయిందని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,64,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబందించిన 432 కోట్ల రూపాయల బోనస్ చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోలు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచినా ఇంత వరకు రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కాలేదని రెండో పంటకు సిద్దం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నారన్నారు.
ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించింది. మహబూబ్ నగర్ జిల్లాలో ముచ్చింతల రైతులు తమ వడ్లు అమ్మి రెండు నెలలు అయినా ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదంటూ జిల్లా కలెక్టర్ ను కలిస్తే బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నది నిజమే, ప్రభుత్వం విడుదల ఆలస్యం అవుతుందని సమాధానం ఇచ్చారు. బహిరంగ మార్కెట్ లో 2,800 రూపాయల నుండి 3,000 రూపాయల ధర పలుకుతున్నా బోనస్ కోసం రైతులు ప్రభుత్వాన్ని నమ్మి దాన్యాన్ని విక్రయిస్తే, తమను ప్రభుత్వం మోసం చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ అబద్దమా..? మీరిచ్చిన బాండ్ పేపర్ బూటకమా..? సమాదానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతులంతా గుండెధైర్యంతో వ్యవసాయాన్ని పండగలా చేశారని మీ పాలనలో వ్యవసాయం దండగలా మారి రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రైతు డిక్లరేషన్ లో ప్రకటించినట్లుగా 2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 15 వేల రూపాయల రైతుభరోసా, అన్ని పంటలకు బోనస్,కౌలు రైతులకు కూడా రైతు భరోసాను 100 రోజుల్లో అమలు చేస్తానని .. దేవుళ్ళ సాక్షిగా మీరు ప్రమాణం చేసి మాట ఇచ్చారని 420 రోజులు పూర్తైనా ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని ఆరోపించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి వారి పక్షాన తక్షణమే హామీలు అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.