ఈసారి బోనాలు అదిరిపోవాలి.. రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం : మంత్రి కొండా సురేఖ-bonalu festival 2025 begin from june 26th at golkonda fort tg govt allocates 20 crore for bonalu jatara ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఈసారి బోనాలు అదిరిపోవాలి.. రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం : మంత్రి కొండా సురేఖ

ఈసారి బోనాలు అదిరిపోవాలి.. రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం : మంత్రి కొండా సురేఖ

Anand Sai HT Telugu

జూన్ 26 నుండి జరిగే ఆషాడ బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం తెలిపారు. బోనాలు ఈసారి అదిరిపోవాలని చెప్పారు.

గొల్కోండలో ఆషాడ బోనాలు (ఫైల్ ఫొటో)

షాడ మాసం బోనాలకు తెలంగాణ సిద్ధమవుతోంది. డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్‌లో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రులు, అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈసారి బోనాల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది.

నిధుల కేటాయింపు

ఎండోమెంట్ శాఖ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలకు ఈ నిధులు విడుదల చేస్తారు. ఈ నిధులను దేవాలయాలకు రంగురంగుల పూలు, ఎల్ఈడీ లైట్లతో అలంకరించడంతో పాటు, వాటికి రంగులు వేయడంలాంటి పనులకు ఉపయోగిస్తారు. ఉత్సవాల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలోని 28 ముఖ్యమైన దేవాలయాలలో పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

ఇబ్బందులు లేకుండా చూడాలి

ఉత్సవాల సందర్భంగా వీఐపీల కదలికల సమయంలో తొక్కిసలాటలు జరుగుతున్నాయని, అందువల్ల తొక్కిసలాట వంటి పరిస్థితులు జరగకుండా చూడాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈసారి వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నారు. జోగినీలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఉత్సవాల సమయంలో అనవసరమైన సమస్యలను నివారించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఆలయానికి వెళ్ళేటప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అధికారులకు స్పష్టం చేశారు.

జూన్ 26న తొలి బోనం

జూన్ 26 గోల్కొండ తో తొలి బోనం ప్రారంభం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జూలై 1 బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 13 వ తేదీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, 14 వ తేదీ రంగం, 20 నాడు అక్కన్న మాదన్న బోనాల జాతర, లాల్ దర్వాజా బైబిలు జరుగుతాయి.. జూలై 24 కి ఈ బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. ఇంకా ఏదైనా దేవాలయానికి రాని నిధులు ఉంటే దేవాదాయ శాఖకు అప్లికేషన్ పేట్టుకోవాలన్నారు మంత్రి పొన్నం.

ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.