Nizamabad Crime : లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకొని... బాలికపై కౌన్సిలర్ అఘాయిత్యం..! రెండోసారి 'పోక్సో' కేసు నమోదు..
POCSO Case On Bodhan councillor : మైనర్ బాలికపై ఓ కౌన్సిలర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు.
పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ కౌన్సిలర్… మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకొని అత్యాచారం చేశాడు. ఓ వైన్స్ షాపు వద్ద కారు ఆపగా… బాలిక ఏడుస్తుండటంతో స్థానికులు గమనించటంతో విషయం బయటికి వచ్చింది. అతగాడిని చితకబాదిన స్థానికులు… పోలీసులకు అప్పగించారు.
ప్రాథమిక వివరాల ప్రకారం… ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణ ఈ ఘటనలో అరెస్ట్ అయ్యాడు. రాధాకృష్ణ నిజామాబాద్ వైపునకు వెళ్తున్న సమయంలో…. తల్లికి మెడిసన్స్ తీసుకొచ్చేందుకు ఆటోలో ఓ మైనర్ బాలిక వెళ్తోంది. ఒంటరిగా వెళ్తున్న బాలికను గమనించిన కౌన్సిలర్… ఆటో వద్దకు వెళ్లి బాలికతో మాట కలిపాడు. తాను కూడా నిజామాబాద్ కే వెళ్తున్నానని చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు.
కొంత దూరం వెళ్లిన తర్వాత… కౌన్సిలర్ తన కారును మంగళ్‌పహాడ్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతం వైపు మళ్లించాడు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎడపల్లి వద్దకు వచ్చాడు. వైన్స్‌లో మద్యం తీసుకుని తాగుతుండగా….. కారులో ఉన్న బాలిక గట్టిగా కేకలు వేసింది.
అక్కడ ఉన్న స్థానికులు గమనించి… కౌన్సిలర్‌ను పట్టుకు ని ప్రశ్నించారు. ఇదే సమయంలో బాలికను వివరాలను అడగగా… అసలు విషయం చెప్పింది. దీంతో అతడిని చితకబాదిన స్థానికులు ఎడపల్లి పోలీసులకు అప్పగించారు. సదరు కౌన్సిలర్‌ను బోధన్ సీఐ కార్యాలయానికి తరలించారు. కౌన్సిలర్ పై పోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.
కౌన్సిలర్‌పై పోక్సో కేసు నమోదు కావడం ఇది రెండోసారి. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారనే ఆరోపణలపై రాధాకృష్ణతో పాటు అతని సోదరుడు కె రవీందర్‌లను 2023 జూన్‌లోనూ బోధన్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసును వెనక్కి తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులపై పలువురు ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. రాజీకి కుదిరించే ప్రయత్నం జరిగినప్పటికీ… ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా కేసు నమోదుకే మొగ్గు చూపటంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.