BJP Telangana: ప్లాన్ మార్చిన కమలనాథులు... ఇక తెలంగాణలో 'రథయాత్రలు'
TS Assembly Elections 2023: ఎన్నికల ఏడాది రావటంతో ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ...ప్రజల్లోకి వెళ్లేందుకు మరో స్కెచ్ వేసింది. త్వరలోనే రథయాత్రల చేపట్టేందుకు సిద్ధమైంది.
TS Assembly Elections 2023 News: తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికల ఏడాది కావటంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పాటు పక్కా ప్లాన్ తో అడుగులు వేసే పనిలో పడ్డాయి. ఇక అధికార బీఆర్ఎస్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించే పనిలో పడగా.. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటూ కమలనాథులు(బీజేపీ) సవాల్ విసిరుతున్నారు. కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నారు. ఓ వైపు ప్రజాసంగ్రామయాత్రతో ప్రజల్లోకి వెళ్తూనే... తాజాగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ... బీజేపీ నాయకత్వం... వ్యూహాం మార్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రలు..!
తాజాగా పార్టీ అగ్రనేత అమిత్ షాతో తెలంగాణ నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో జరగబోయే ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలంపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. కర్ణాటక ఎన్నికలు ముగిశాక... అమిత్ షా పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టిపెట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యూహాల రూపకల్పన నుంచి క్షేత్రస్థాయి ప్రచారం దాకా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయలేమికి పరిష్కారం దిశగా కూడా చర్యలు తీసుకోవటంపై కూడా ఫోకస్ చేస్తారని సమాచారం. ఇక ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్ ఇచ్చి.... అన్ని నియోజకవర్గాల్లో రథయాత్రలను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి అదరణ పెరుగుతున్న నేపథ్యంలో... అవకాశాన్ని చేజార్చుకోవద్దనే భావనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగటంతో పాటు... రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రలు చేయటం ద్వారా... ప్రజలకు మరింత చేరువ కావాలని యోచిస్తోంది.
మొత్తంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ... తెలంగాణ పాలిటిక్స్ హీట్ ను పెంచేస్తున్నాయి. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ లు కూడా పేలుతున్నాయి. ఓవైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుండగా.. బీజేపీ నేతలు కార్నర్ స్ట్రీట్ లు నిర్వహిస్తూ... బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరోవైపు కేటీఆర్... పలు నియోజకవర్గాలకు వెళ్తున్నారు. ఇరుపార్టీలను టార్గెట్ చేస్తూ... విమర్శలను తిప్పికొడుతున్నారు. అయితే ఎన్నికల టైం మరింత దగ్గర పడే వేళ.. పరిస్థితి మరింత మారే అవకాశం ఉంది…!
సంబంధిత కథనం