Telugu News  /  Telangana  /  Bjp State President Bandi Sanjay Fires On Trs Govt
ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్
ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్

Bandi Sanjay On TRS Govt: తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారు..?

01 December 2022, 7:03 ISTHT Telugu Desk
01 December 2022, 7:03 IST

bandi sanjay praja sangrama yatra: బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. బుధవారం రాత్రి పలు గ్రామాల మీదుగా సాగగా... టీఆర్ఎస్ సర్కార్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

bandi sanjay slams trs govt: ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క హామీని అమలు చేయటం లేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నిర్మల్ జిల్లా పరిధిలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించిన బండి సంజయ్.... ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ సర్కార్ పక్కదోవ పట్టించిందన్నారు. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ పేరుతో దగా చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో అసెంబ్లీ వేదికగా జాగ ఉన్నవారికి రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పారని... ఇప్పుడేమో రూ. 3 లక్షలు అంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు బండి సంజయ్. తాము అధికారంలోకి రాగానే ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి పేదలకు అందజేస్తామని చెప్పారు.

దేశం కోసం ధర్మం కోసం తాను ఎన్నోసార్లు జైలుకు వెళ్లానని పేర్కొన్నారు. కేసీఆర్‌ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగరవేస్తామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. 80 వేల ఉద్యోగాలు అన్న కేసీఆర్... ఇప్పటి వరకు ఎన్ని భర్తీ చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలపై ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇంట్లో ఐదు మందికి ఉద్యోగాలు వచ్చాయని... గ్రామాల్లో మాత్రం యువకులకు ఉద్యోగాలు రాలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి... ఇప్పటివరకు అమలు చేయలేదని ఆక్షేపించారు. దళితబంధు, పోడుభూముల పరిష్కారం వంటి అమలులో కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు.

ఐదో విడత పాదయాత్రలో భాగంగా భైంసా నుండి కరీంనగర్ వరకు యాత్ర సాగనుంది. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 1 నుండి 6 వరకు నిర్మల్ అసెంబ్లీ నియోగాజవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 2న రాంపూర్ నుండి లోలం మీదుగా చిట్యాల వరకు 3న చిట్యాల నుండి మంజులపూర్, నిర్మల్ రోడ్, ఎడిగం, ఎల్లపల్లి, కొండాపూర్ మీదుగా ముక్తపూర్ వరకు కొనసాగనుంది. 4న లక్ష్మణ్ చందా మండలంలో 5న మమ్డా మండలంలో, 6,7న ఖానాపూర్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. డిసెంబర్ 8,9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలో 21.7 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 10న కోరుట్ల పట్టణం మీదుగా వేములవాడ నియోజకవర్గానికి చేరుకోనుంది.డిసెంబర్ 11న మేడిపల్లి, తాటిపల్లి మీదుగా జగిత్యాల రూరల్ వరకు యాత్ర సాగనుంది. డిసెంబర్ 12న జగిత్యాల పట్టణం, డిసెంబర్ 13న చొప్పదండి నియోజకవర్గం నుండి కొండగట్టుకు చేరుకోనుంది. డిసెంబర్ 14,15,16 తేదీలో చొప్పదండిలో యాత్ర కొనసాగగా..డిసెంబర్ 16,17న కరీంనగర్ లో పాదయాత్ర సాగగా చివరి రోజు కరీంనగర్ లోని SR నగర్ కళాశాల వద్ద పాదయాత్ర ముగియనుంది.