Bjp Tickets Issue: బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల వడపోత ప్రారంభం,దరఖాస్తుకు సీనియర్లు దూరం
Bjp Tickets Issue: తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్ని అభ్యర్థుల వడపోతలో నిమగ్నం అయ్యాయి. బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి దాదాపు ఆరు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పలువురు సీనియర్లు నిరాసక్తత చూపుతున్నారు.
Bjp Tickets Issue: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేసింది. మరోవైపు టికెట్లకు ఆ పార్టీ ముఖ్యనేతలు దరఖాస్తు చేయకపోవడం చర్చగా మారింది.
ట్రెండింగ్ వార్తలు
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు దూరంగా ఉన్నారు. తమకు ఖచ్చితంగా టిక్కెట్ వస్తుందనే నమ్మకంతో కొందరు, పార్లమెంటుకు పోటీ చేయాలని మరికొందరు భావిస్తున్నారు. తమకు కాకుండా ఎవరికి టిక్కెట్ ఇస్తారని నేతల దబాయిస్తున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం 6 వేల మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల బరిలో ఉంటారని భావిస్తున్న పలువురు నేతలు మాత్రం తెలంగాణలో పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకోలేదు.
బీజేపీలో టికెట్ కోసం 6వేల మంది దరఖాస్తు చేసినా.. ముఖ్య నేతల పేర్లు అందులో కనిపించడం లేదు. పార్టీలో ఓ మాదిరి గుర్తింపు ఉన్న వారు, పదవుల్లో ఉన్నవారు ఎవరు మళ్లీ పోటీకి ఆసక్తి చూపించడం లేదు.
పార్టీ సీనియర్లంతా పార్లమెంటుకు పోటీ చేయాలని భావిస్తున్నారు. బీజేపీ ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేల్లో రఘునందన్‌రావు మినహా ఎవరూ టికెట్ కోసం దరఖాస్తు చేయలేదు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మినహా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు దరఖాస్తు చేయలేదు.
చాలామంది నాయకులు దరఖాస్తు చేయకపోవడానికి కారణం ఏమిటనే చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పోటీ చేస్తారా లేదా అనే సందేహాలు ఉన్నాయి. అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పిన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ వంటి నేతలు కూడా మళ్లీ పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
మాజీ ఎమ్మెల్యేలు డీకే అరుణ, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి వంటి వారి పరిస్థితి ఏమిటో తెలియదు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి నాయకులు కాంగ్రెస్‌లో జంప్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ప్రస్తుతం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఆ నియోజకవర్గం నుంచి విక్రమ్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రాజాసింగ్‌ను కాదని విక్రమ్‌కు టిక్కెట్ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది.
తెలంగాణలో గట్టి పట్టు ఉన్న 30-40 నియోజక వర్గాల్లో ఎవరు పోటీ చేయాలనే విషయం ఇప్పటికే పార్టీ పెద్దలకు స్పష్టత ఉందని చెబుతున్నారు. మిగిలిన చోట్ల పోటీకి మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.