Etela Rajender : పోచారం పరిధిలో పేదల స్థలాలు కబ్జా, ల్యాండ్ బ్రోకర్లకు పోలీసుల అండదండలు - ఎంపీ ఈటల రాజేందర్-bjp mp etela rajender fires on real estate brokers in pocharam land grabbing incidents ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Etela Rajender : పోచారం పరిధిలో పేదల స్థలాలు కబ్జా, ల్యాండ్ బ్రోకర్లకు పోలీసుల అండదండలు - ఎంపీ ఈటల రాజేందర్

Etela Rajender : పోచారం పరిధిలో పేదల స్థలాలు కబ్జా, ల్యాండ్ బ్రోకర్లకు పోలీసుల అండదండలు - ఎంపీ ఈటల రాజేందర్

Bandaru Satyaprasad HT Telugu
Jan 21, 2025 02:42 PM IST

Etela Rajender : పోచారం మున్సిపాలిటీ పరిధిలో ల్యాండ్ బ్రోకర్ల ఆగడాలు మితిమీరిపోయాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల పేదల ఖాళీ స్థలాలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు... పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలతో కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.

పోచారం పరిధిలో పేదల స్థలాలు కబ్జా, ల్యాండ్ బ్రోకర్లకు పోలీసుల అండదండలు - ఎంపీ ఈటల రాజేందర్
పోచారం పరిధిలో పేదల స్థలాలు కబ్జా, ల్యాండ్ బ్రోకర్లకు పోలీసుల అండదండలు - ఎంపీ ఈటల రాజేందర్

Etela Rajender : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ బ్రోకర్లపై ఈటల చేయి చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.

yearly horoscope entry point

"నేను ఇక్కడికి పోతున్నా అని మంత్రికి, పోలీసులకు చెప్పి వచ్చా..నేను ఇక్కడ ఉండగా వారి గుండాలు బెదిరింపులకు దిగారు. ఎంపీకి చెప్తారా మీ సంగతి చెప్తాం అని బెదిరిచారట.పోలీసుల్లారా మీరు ఎవరికి మద్దతు తెలుపుతున్నట్లు. పోలీసులకు గౌరవం లేకుండా పోయింది. ప్రజలకు పోలీసులు రక్షణ కలిపించకపోతే మేమే మా చేతుల్లోకి తీసుకుని ఇక్కడ ఉన్న గుండాలను తరిమికొడతాం. బాధితులు కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు పట్టించుకోలేదు. రౌడీలు రాళ్లు పట్టుకొని బెదిరించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పేదల ఖాళీ స్థలాలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు... పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలు చేస్తున్నారు. పేదలపై దౌర్జన్యం చేస్తున్నారు"- ఎంపీ ఈటల రాజేందర్

అరుంధతి నగర్, బాలాజీ నగర్, జవహర్ నగర్ లో ఇలానే చేస్తే నేనే స్వయంగా వెళ్లి వచ్చాను. 40 గజాలు, 60 గజాల్లో ఇల్లు కట్టుకుంటున్న పేదల ఇళ్లను అధికారులు కూలగొట్టి పోతున్నారు. దీనిపై రెవెన్యూ మంత్రి, కలెక్టర్, సీపీతో మాట్లాడాను. నేను ఎంపీ అయ్యి ఆరు నెలలు అవుతుంది. రోజు పేదల కన్నీళ్లు చూస్తున్నారు. ఈ కాలనీలో నివాసముంటున్న వారిని కొంతమంది కబ్జాదారులు గుండాలను పెట్టి తాగిపించి, తినిపించి బెదిరిస్తున్నారు. పేదలు ఇల్లు కట్టుకుంటే గుండాలు వచ్చి కూలగొడుతున్నారు. అధికారులు, పోలీసులు గుండాలకు మద్దతు తెలుపుతున్నారు. కంచే చేను మేసినట్టు ఉంది పరిస్థితి"- ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీ

పేదల మీద దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్

రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పేదల కాలనీలకు రూపశిల్పి బీజేపీ, పేదలు కొనుక్కున్న జాగాలకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. బీజేపీ ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడదన్నారు. అధికారులు ల్యాండ్ బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని ఈటల మండిపడ్డారు.

1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారన్నారు. 149 ఎకరాలను దొంగ కాగితాలు సృష్టించి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు, కలెక్టర్ కు, సీపీకి, మంత్రికి, సీఎంకు ఇక్కడ పరిస్థితులపై ఉత్తరాలు రాస్తానన్నారు. తప్పు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది, వాళ్లని జైల్లో పెట్టాలన్నారు. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అని ఈటల హెచ్చరించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చెస్తే పాలన సులభం అవుతుంది, కలెక్టర్లు అందుబాటులో ఉంటారని అనుకున్నామని, కానీ కలెక్టర్లు దొరకడం లేదన్నారు. పోలీస్ కమిషనర్ కు ఎంపీని కలవడానికి సమయం ఉండదు కానీ బ్రోకర్లను కలవడానికి మాత్రం సమయం ఉంటుందని విమర్శించారు.

Whats_app_banner

సంబంధిత కథనం