హైదరాబాద్ నగరంలో వేగవంతమైన పట్టణ విస్తరణతో పాటు జనాభా పెరిగిపోతోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు, సేవలను అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. ఈ సవాళ్లను గుర్తించి కేంద్ర ప్రభుత్వం… స్మార్ట్ సిటీస్, అమృత్ పథకాల కింద నిధులు కేటాయించటం ఎంతో ప్రశంసనీయమైనదన్నారు. శుక్రవారం లోక్ సభలో మాట్లాడిన ఈటల… జల్ శక్తి మంత్రిత్వ శాఖకు గ్రాంట్లకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.
దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మాల్కాజ్ గిరిలో వేగంగా పట్టణీకరణ జరుగుతోందని ఈటల చెప్పారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పలు రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో ఎంతో మంది స్థిరపడి ఉన్నారని గుర్తు చేశారు.వేగవంతంగా పట్టణీకరణ జరుగుతుండటంతో… పారిశుద్ధ్య పనులు, తాగునీటి సౌకర్యాలను కల్పించటంలో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో… పారిశుద్ధ్య ప్రాజెక్టులకు, తాగునీటి సౌకర్యాలకు కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
"హైదరాబాద్‌లోని సరస్సులు మురుగునీటితో కలుషితం కావడం వల్ల నగరం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఈ నగరాన్ని సరస్సుల నగరం అని పిలిచేవారు. హుస్సేన్ సాగర్‌తో సహా దాని నీటి వనరులు అన్ని మురుగునీటి ప్రవాహాల కారణంగా కలుషితమయ్యాయి. దీంతో జీవవైవిద్యం పూర్తిగా దెబ్బతింది. కలుషితమైన నీరు బయటకు రావడంతో పాటు… భూగర్భ జలాలు కూడా కాలుష్యమవుతున్నాయి. ఇలాంటి నీటి ద్వారా వ్యాధులు కూడా సంక్రమిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి" అని ఎంపీ ఈటల కేంద్రం దృష్టికి తీసుకెెళ్లారు.
“ఈ సరస్సులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మురుగునీటిని మళ్లించటంతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాలను బలోపేతం చేసే కార్యక్రమాలకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. శుద్ధి చేయని మురుగునీటిని సరస్సుల నుంచి దూరంగా మళ్లించాల్సి ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ ప్రాంతానికి మూసీ జీవనదిగా ఉండేది. ఇప్పుడు విషపూరిత వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీటి ప్రవాహాల కారణంగా తీవ్రమైన పర్యావరణ మరియు ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. జలశక్తి మంత్రిత్వ శాఖ తగినంత నిధులను కేటాయించి… మూసీ నది వెంబడి ఉన్న మురుగునీటి శుద్ధి కర్మాగారాలను (STPలు) మెరుగుపరచాల్సిన అవసరం ఉంది”అని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.
"పర్యావరణ స్థిరత్వం, భూగర్భ జలాల పునరుద్ధరణ, హైదరాబాద్ నివాసితుల శ్రేయస్సు కోసం మూసీ నది చాలా అవసరం. అందువల్ల ఈ విషయంలో కేంద్ర జల మంత్రిత్వశాఖ ప్రత్యేక దృష్టి పెట్టి…. త్వరితగతిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైన నిధుల కేటాయింపు కోసం ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుతున్నాను" అని ఎంపీ ఈటల రాజేందర్ లోక్ సభలో ప్రసంగించారు.