Karimnagar BJP : కరీంనగర్ లో రోడ్డెక్కిన కమలదళం - రైతు సమస్యలపై కలెక్టరేట్ ముందు సత్యాగ్రహం-bjp leaders hold satyagraha in front of karimnagar collectorate on farmer issues ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Bjp : కరీంనగర్ లో రోడ్డెక్కిన కమలదళం - రైతు సమస్యలపై కలెక్టరేట్ ముందు సత్యాగ్రహం

Karimnagar BJP : కరీంనగర్ లో రోడ్డెక్కిన కమలదళం - రైతు సమస్యలపై కలెక్టరేట్ ముందు సత్యాగ్రహం

HT Telugu Desk HT Telugu

రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది.‌ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు సత్యాగ్రహం దీక్ష చేశారు. పంటల బీమా యోజన అమలు చేయాలని, ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్ నుంచే రైతు ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

కలెక్టరేట్ ముందు బీజేపీ నేతల సత్యాగ్రహం

ఆరుకాలం శ్రమించే అన్నదాతలను గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అష్టకష్టాలు పాలు చేస్తుందని ఆరోపిస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముఖ్య నాయకులు కరీంనగర్ కలెక్టరేట్ ముందు శుక్రవారం రెండు గంటల పాటు సత్యాగ్రహం దీక్ష చేశారు. దీక్షలో బిజేపి కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, బిజేపి కరీంనగర్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, గోపి పాల్గొని ప్రభుత్వ తీరు కాంగ్రెస్ నేతల వైఖరి పై మండిపడ్డారు.

సమగ్ర పంటల బీమా పథకం అమలు, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ సత్వరమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఫ్ల కార్డులు, దెబ్బతిన్న పంటలను ప్రదర్శించారు. ‘వద్దురా నాయన… కాంగ్రెస్ పాలన’ అంటూ నినాదాలు చేశారు. రైతుల ఇక్కట్లకు కాంగ్రెస్ పాలకులే కారణమని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసి, ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బిఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పాలకులు....

రైతు సమస్యల పట్ల గతంలో బీఆర్ఎస్ మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని ఆరోపించారు. ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు వాగ్దానాలు చేశారని, ఎన్నికల ముందు కోతలు కోసిన రేవంత్ రెడ్డి, ఎన్నికల తర్వాత ఎగవేతలను నమ్ముకొని కుంటి సాకులతో రైతులకు ఇచ్చిన హామీలన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. వాగ్దానాల్లో కోతలు పెడుతూ, రైతాంగాన్ని గోసపెడుతున్నారని మండిపడ్డారు. గత కెసిఆర్ ప్రభుత్వం కంటే దారుణంగా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందన్నారు.

రుణమాఫీ 30 శాతమే...

రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల మంది కూడా రుణమాఫీ చేయలేదన్నారు శ్రీధర్ రెడ్డి. 70% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారని ఆరోపించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో తెలియజేయాలని, రుణమాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతు భరోసా విషయంలో కూడా రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందన్నారు.

ఎన్నికల ముందు ఎకరాకు రూ. 15వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చాక 12 వేలు ఇస్తామని మాట మార్చిందన్నారు. రైతు భరోసా నేటికీ చాలామంది రైతులకు రైతు పెట్టుబడి సాయం అందలేదన్నారు. కాలయాపనతో రైతులను తీవ్ర ఇబ్బంది గురిచేస్తుందన్నారు. రైతు కూలీలకు 12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎంతమంది రైతు కూలీలకు సహాయం అందించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 14 పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొని నేడు కేవలం ఒక సన్న వడ్లకే బోనస్ ఇస్తుందని ఆ అంశం బోగస్ ప్రక్రియగా మార్చిందన్నారు. రైతులకు తక్షణం బోనస్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నష్టపరిహారం తక్షణమే అందించాలి...

సాగునీరు సక్రమంగా అందక ఎండిపోయిన పంటలకు, అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని బిజేపి జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే ఫసల్ బీమా యోజన సాయం రైతులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెడితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేయడం లేదని తెలిపారు.

పంటను సక్రమంగా కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల సమయంలో అనేక ఆంక్షలు, కొర్రీలు పెడుతూ రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతు నష్టపెడుతుందన్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేనిచో రైతుల పక్షాన బిజెపి నిరంతర పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.

రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

HT Telugu Desk