BL Santhosh Hyd Visit: 28న హైదరాబాద్ కు బీఎల్ సంతోష్.. ఎర కేసుపై స్పందిస్తారా..?-bjp leader bl santhosh come to hyderabad on 28 december over vistaaraks meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bjp Leader Bl Santhosh Come To Hyderabad On 28 December Over Vistaaraks Meeting

BL Santhosh Hyd Visit: 28న హైదరాబాద్ కు బీఎల్ సంతోష్.. ఎర కేసుపై స్పందిస్తారా..?

Mahendra Maheshwaram HT Telugu
Dec 25, 2022 12:25 PM IST

bjp vistaaraks meeting at hyderabad: ఈ నెల 28న బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ హైదరాబాద్ రానున్నారు. ఎమ్మెల్యే ఎర కేసులో ప్రధానంగా ఆయన పేరు వినిపించిన సంగతి కూడా తెలిసిందే. సిట్ నోటీసులు పంపినప్పటికీ ఆయన రాలేదు. హైకోర్టు నుంచి స్టే అర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ టూర్ ఖరారు కావటం ఆసక్తిని రేపుతోంది.

బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్
బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ (twitter)

BJP leader BL Santhosh hyderabad visit: BL సంతోష్.... గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తెగ వినిపిస్తున్న పేరు..! ఆయన ఏం చేస్తారు..? బీజేపీలో ఆయన రోల్ ఏంటీ..? టాప్ లీడర్లలో ఆయన ఒకరా..? ఇలా అనేక అంశాలు చర్చకు కూడా వచ్చాయి. కారణం.. సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు..! ఈ కేసు తెర వెనక నడిపించింది అంతా ఆయనే అనేది బీఆర్ఎస్ ఆరోపణ..! సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కూడా ఆ కోణంలోనే చూస్తోంది. ఆయన్ను విచారించాలని నోటీసులు పంపినప్పటికీ సంతోష్ రాలేదు. పైగా హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఈ క్రమంలో... ఆయన హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. తాజా పరిస్థితుల్లో సిట్ ఏం చేయబోతుంది..? ఎమ్మెల్యేల ఎర కేసుపై బీఎల్ సంతోష్ స్పందిస్తారా..? బీఆర్ఎస్ ఆరోపణపై ఏమైనా కామెంట్స్ చేస్తారా..? అనేది అత్యంత ఆసక్తిని రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్ వేదికగా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులు బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి బీఎల్ సంతోష్ హాజరుకానున్నారు. 29న జరగనున్న సమావేశంలో అసెంబ్లీ ఇంఛార్జులు, కన్వీనర్లు, విస్తారక్‌లు, పాలక్‌లకు మార్గ నిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అమిత్‌షాతో పాటు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ , సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం, అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

సిట్ పై స్పందిస్తారా..?

రాష్ట్రంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఎల్ సంతోష్ పేరు ప్రధానంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ కేసుపై గానీ, సిట్ నోటీసుల విషయంపై గానీ స్పందిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారా..? లేక ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారా..? అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సిట్ ఏమైనా చేస్తుందా..? అనేది కూడా జోరుగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణపై బీజేపీ అధిష్టానం పూర్తిస్థాయి దృష్టి సారించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగురవేయాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణలో నియోజకవర్గాల వారిగా పార్టీ పురోగతిపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఏర్పాటుపై బీజేపీ అగ్రనేతలు స్పందిస్తారా..? మరోసారి ఇరు పార్టీల నేతల మధ్య మాటలు పేలుతాయా..?అనేది చూడాలి.

IPL_Entry_Point