TS BJP : తెలంగాణలో బీజేపీ ప్లాన్ రివర్స్ అవుతుందా? ఈటల, కోమటిరెడ్డి చూపు కాంగ్రెస్ వైపేనా?
TS BJP : అసంతృప్తి నేతలను హైకమాండ్ దిల్లీకి పిలిచి మాట్లాడుతుంది. అయితే దిల్లీ వెళ్లిన ఈటల, కోమటిరెడ్డికి వింత అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.
TS BJP : తెలంగాణలో బీజేపీ ప్లాన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటక ఫలితాల ప్రభావంతో ఇతర పార్టీల నుంచి బీజేపీ చేరిన నేతలు పక్క చూపులు చూస్తున్నారు. దీంతో పాటు నేతల మధ్య విభేదాలు తలెత్తడంతో బీజేపీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. అసంతృప్తి నేతలను దిల్లీకి పిలిచి మాట్లాడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దిల్లీకి పిలిచి సమస్యలపై ఆరా తీసింది. బీఆర్ఎస్ ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రస్తుత వ్యూహాలు సరిపోవని తమ సమస్యలను హైకమాండ్ కు వివరించారు. అయితే హైకమాండ్ నుంచి సరైనా స్పందన రాకపోవడంతో నేతలు ఇరకాటంలో పడ్డారు.
తెలంగాణ బీజేపీ కోల్డ్ వార్
తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ వార్ నడుస్తోంది. ఇప్పుడు ఈ వివాదం దిల్లీ వరకు చేరింది. బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని భావించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. పార్టీలో బండి సంజయ్, ఈటల వర్గాలుగా నేతలు విడిపోయారని తెలుస్తోంది. పార్టీలో కొంత మంది బండి సంజయ్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. తెలంగాణ బీజేపీ చీఫ్ ను మార్చాలని కొందరు నేతలు బీజేపీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. పార్టీలో పరిణామాలపైనా రిపోర్టులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ అధినాయకత్వం మాత్రం తెలంగాణ చీఫ్ ను మార్చే యోచనలో లేదని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ హైకమాండ్ చర్యలు తీసుకోకపోవడంతో కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీజేపీ హైకమాండ్ తో ఈటల, కోమటిరెడ్డి చర్చలు
ఈటల, కోమటిరెడ్డి బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ పట్ల బీజేపీ హైకమాండ్ మెతకగా వ్యవహరిస్తుందని, తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ప్రస్తుత వ్యూహాలు సరిపోవని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ మారాలని తమ అనుచరుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని ఈ నేతలు అంటున్నారు. దీంతో బీజేపీ హైకమాండ్ తో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారని తెలుస్తోంది. కేటీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వటం, లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకపోవటంతో వెనుక బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా తాము పార్టీలో చేరామని ఈటల, కోమటిరెడ్డి అంటున్నారు.
అంతు చిక్కని హైకమాండ్ తీరు
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించినా... ఈటల, కోమటిరెడ్డి దిల్లీలోనే ఉండిపోయారు. బీజేపీ అగ్రనేతలతో వీరిద్దరూ భేటీ అవుతున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ నుంచి ఈ ఇద్దరకు స్పష్టమైన హామీ లభించలేదని తెలుస్తోంది. పార్టీ మారాలని తమపైన ఒత్తిడి ఉందని చెప్పినా బీజేపీ నాయకత్వం పట్టించుకోలేదని సమాచారం. పార్టీ వీడే ఆలోచన మార్చుకోవాలని అధినాయకత్వం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈటల, కోమటిరెడ్డి భవిష్యత్ నిర్ణయాలపైన మల్లగుల్లాలు పడుతున్నారు. హైకమాండ్ తీరు అంతు చిక్కటం లేదని ఈ నేతలు అంటున్నారని కీలక సమాచారం. అటు వ్యాపారాలు, ఇటు రాజకీయాలు దేనిని పణంగా పెట్టలేక సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఘర్ వాపసీపై దృష్టిపెట్టారు. దిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. జులై 2న ఖమ్మం సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఈ సభలో పొంగులేటి, జూపల్లి సహా 35 మంది నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ తరుణంలో కొన్నాళ్లు వేచిచూసి నిర్ణయాలు తీసుకోవాలని ఈటెల, కోమటిరెడ్డితో సహా పలువురు నేతలు భావిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.