BJP Eyes on Congress Leaders : అరవింద్ అప్రమత్తం చేశారా ? ఆహ్వానించారా ?-bjp eyes on congress leaders for strengthening party in telangana
Telugu News  /  Telangana  /  Bjp Eyes On Congress Leaders For Strengthening Party In Telangana
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

BJP Eyes on Congress Leaders : అరవింద్ అప్రమత్తం చేశారా ? ఆహ్వానించారా ?

15 December 2022, 21:57 ISTHT Telugu Desk
15 December 2022, 21:57 IST

BJP Eyes on Congress Leaders : తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్ కి పదును పెట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకు బహిరంగ వేదికల నుంచే పరోక్ష ఆహ్వానాలు పంపుతోంది. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు.. ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

BJP Eyes on Congress Leaders : బీజేపీ నాయకుల ఇటీవలి ప్రసంగాలు పరిశీలిస్తే.. తెలంగాణలో గెలుపునకి వారు చాలా దగ్గరికి వచ్చారన్న విశ్వాసం ధ్వనిస్తోంది. "కేసీఆర్ ని గద్దె దించుతాం. గడీలు బద్దలు కొడతాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం మేమే. వచ్చే ఎన్నికల్లో విజయం మాదే" అంటూ బహిరంగ సభల్లో స్వరం పెంచి నినదిస్తున్నారు. బీఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లో అడుగు పెట్టిన కేసీఆర్ కి ఇక వీఆర్ఎస్ దిక్కని ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ ది కుటుంబ పాలన అని ఆరోపిస్తూ.. వారి ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపే రోజులు దగ్గరపడ్డాయని జోష్యం చెబుతున్నారు. అయితే.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపోటమలు సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుత తెలంగాణ బీజేపీకి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే శక్తి ఉందా ? పార్టీ తరపున పోటీ చేసేందుకు అన్ని నియోజవర్గాల్లో బలమైన నేతలు ఉన్నారా ? గ్రామీణ స్థాయిలోనూ ఓట్లు రాబట్టగలిగే సామర్థ్యం సాధించారా ?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. కేవలం ఒక్కస్థానంలోనే విజయం సాధించింది. 103 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. కానీ ఆ వెంటనే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా.. 4 పార్లమెంట్ స్థానాలు గెలుపొందింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి, టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీని దాదాపు ఓడించినంత పనిచేసింది. జీహెచ్ఎంసీ, పార్లమెంట్ స్థానాల ఫలితాలు మినహాయించి.. అసెంబ్లీ బై పోల్ రిజల్ట్స్ పరిశీలిస్తే.. గట్టి అభ్యర్థి ఉంటే.. బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుందని స్పష్టమైంది. అందుకే.. 2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా బలమైన అభ్యర్థులు కావాలి !

తమదైన అజెండాతో బీజేపీ తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అయితే తమకి ఎందుకు ఓటెయ్యాలన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి, గ్రామ స్థాయి నుంచి కూడా మెప్పు పొందే నేతల కోసం వెతుకులాటను తీవ్రం చేసింది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి వంటి పేరున్న నేతలను తమ గూటికి తీసుకొచ్చింది. ఈ జోరు ఇంకా పెంచాలని చూస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీపై కన్నేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో గురువారం జరిగిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు.. ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేసీఆర్ గుర్తించారని... మళ్లీ అధికారంలోకి రావాలంటే.. కాంగ్రెస్ పార్టీతో కలవకతప్పదని నిర్ణయించుకున్నారని అరవింద్ ఆరోపించారు. బీఆర్ఎస్ పేరిట జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు కేసీఆర్ మద్దతు ఇస్తారని, ప్రతిఫలంగా తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు హస్తం పార్టీ సహకరించాలనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పోటీ చేసే సీట్లలో బీఫాం ఎవరికి ఇవ్వాలో కూడా కేసీఆర్ నిర్ణయిస్తారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు మేల్కోవాలని సూచించారు. భవిష్యత్తుని కాపాడుకునే పనిమీద కాంగ్రెస్ నేతలు దృష్టి సారించాలని హితబోధ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేయడమే అని... ఇంతకు మించి వేరే సిద్ధాంతం, అజెండా ఏమీ కేసీఆర్ కు లేదని అరవింద్ విమర్శించారు.

కాంగ్రెస్ నాయకులు భవిష్యత్తు చూసుకోవాలన్న అరవింద్ మాటల్లో మర్మమేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది ! బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. దాదాపుగా అరవింద్ తరహాలోనే వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరు ప్రకటించకున్నా.. టీఆర్ఎస్ పాలనపై విసుగు చెందిన వారు, వ్యతిరేకిస్తున్న వారు అందరూ... బీజేపీతో కలిసి నడవాలని ఆహ్వానించారు. కేసీఆర్ కి ప్రత్యామ్నాయం తామే అని బలంగా చెబుతున్న కమలం నేతలు.. బలమైన అభ్యర్థులూ తమ వేదికను ఎంపిక చేసుకోవాలని నేరుగా ఆహ్వానాలు పంపుతున్నట్టే అనిపిస్తోంది. మున్ముందు ఇలాంటి ఇన్విటేషన్స్ ఇంకా పెరిగే అవకాశాలూ ఉన్నాయి. మరి బీజేపీ ఆశిస్తున్నట్లు జరుగుతుందా ? ఇప్పటికే అర్బన్ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయిన ఆ పార్టీ.. చేరికల బలంతో గ్రామీణ స్థాయిలోకి వెళుతుందా ? బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ ఎలా అడ్డుకుంటుంది ? ఎన్నికల నాటికి ఈ పరిణామాలు ఏ రూపు తీసుకుంటాయన్నది ఆసక్తి రేపుతోంది.