TS Teacher MLC Result: BRSకు టీచర్లు ఇస్తున్న సందేశమేంటి..? బీజేపీ విక్టరీకి కారణాలు ఇవేనా..? -bjp candidate avn reddy wins mahabubnagar rangareddy hyderabad teachers mlc election 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bjp Candidate Avn Reddy Wins Mahabubnagar-rangareddy-hyderabad Teachers Mlc Election 2023

TS Teacher MLC Result: BRSకు టీచర్లు ఇస్తున్న సందేశమేంటి..? బీజేపీ విక్టరీకి కారణాలు ఇవేనా..?

HT Telugu Desk HT Telugu
Mar 17, 2023 03:56 PM IST

Mahabubnagar-Rangareddy-Hyderabad Teachers MLC Election: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి- హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. ఇక్కడ పీఆర్టీయూ అభ్యర్థిగా ఉన్న చెన్నకేశవరెడ్డి ఓటమిపాలయ్యారు. అయితే ఈ ఫలితం కాస్త తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి
విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి (twitter)

BJP Candidate AVN Reddy win in Teachers MLC election 2023: తెలంగాణలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. పీఆర్‌టీయూ అభ్యర్ధిపై పైచేయి సాధించారు. 1169 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. ఈ గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే ఏవీఎన్ రెడ్డి విజయం కాస్త... తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైందంటూ కమలనాథులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.... అసలు ఈ ఎన్నికల ఫలితం బీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చిందా..? ఉపాధ్యాయుల్లో కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఉందా..? ఏవీఎన్ రెడ్డి విజయానికి కారణాలేంటి..? ఈ రిజల్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఓ ఇండికేషన్ లాంటిదా..? వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం బీజేపీకి బూస్ట్ ఇచ్చినట్లు అయింది. ఆ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన టీపీయూఎస్ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి 1,169 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ పీఆర్టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి ఓటమిపాలయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ హర్షవర్థన్ రెడ్డికి మద్దతు పలికింది. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదని చెబుతూ వస్తోంది. నిజానికి పీఆర్టీయూ... అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తూ వస్తోందన్న వాదన ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసి కాటేపల్లి జనార్థన్ విజయం సాధించారు. అయితే ఈసారి ఆయనకు పీఆర్టీయూ టికెట్ దక్కకపోవటంతో... పీఆర్టీయూ తెలంగాణ సంఘం తరపున బరిలో ఉండగా... పీఆర్టీయూ తరపున చెన్నకేశవరెడ్డి పోటీలో నిలిచారు. అయితే ఇక్కడ బీజేపీ మద్దతుతో ఏవీఎన్ రెడ్డి గెలవటంపై అనేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల్లో బీఆర్ఎస్ సర్కార్ పై వ్యతిరేకత ఉందనటానికి ఏవీఎన్ రెడ్డి విజయమే ఓ ఉదాహరణ అనే వాదన వినిపిస్తోంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు తరపున బీజేపీ చేస్తున్న పోరాటానికి ఈ గెలుపే ఓ నిదర్శనమంటూ పలువుపు బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు.

ఏవీఎన్ రెడ్డి గెలుపు.. కారణాలు ఇవేనా..?

ఏవీఎన్ రెడ్డి గత కొంత కాలంగా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతూ వస్తున్నారు. గతంలో కూడా ఎస్టీయూటీఎస్ తరపున పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. అయితే ఈసారి టీపీయూఎస్ తరపున బరిలో నిలిచిన ఆయనకు... బీజేపీ మద్దతు ప్రకటించింది. అయితే ఏవీఎన్ రెడ్డి విజయంలో 317 జీవో అంశం ప్రధానంగా ప్రభావం చూపిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ జీవోపై ఉపాధ్యాయుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని... అదే విషయాన్ని ఓట్ల రూపంలో చూపించారని తెలుస్తోంది. దీనికితోడు చాలా రోజులుగా ఒకటో తేదీన జీతాలు రావటం లేదని పలు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. 20వ తేదీ వరకు జీతాలు ఇస్తుండటంతో పాటు... టీచర్లకు రావాల్సిన పీఆర్సీ, డీఏ సకాలంలో ఇవ్వకపోవటం కూడా కారణంగా తెలుస్తోంది. ఇవే కాకుండా ఉపాధ్యాయులకు ఇచ్చే హెల్త్ కార్డులు కూడా సరిగా పని చేయకపోవటం, ప్రమోషన్లు, బదిలీల అంశం, ఏకీకృత సర్వీస్ రూల్స్ వంటి అంశాల విషయాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై కోపంతో ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాత పెన్షన్ విధానం కూడా ఓ అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే విషయంలో పీఆర్టీయూ, యూటీఎఫ్ సంఘాలు వెనకబడుతున్నాయన్న భావనలో కూడా టీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడే విషయంలో ఏవీఎన్ రెడ్డి ముందుటారని, దీనికి తోడు బీజేపీ మద్దతు ఉండటం కూడా మరింత బలం చేకూరుతుందన్న భావనలో ఉపాధ్యాయులు ఉన్నట్లు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ గెలుపు ద్వారా... బీఆర్ఎస్ ప్రభుత్వానికి బలమైన సందేశాన్ని పంపాలన్న భావన కూడా టీచర్లలో ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తాజా ఫలితంపై ఓ ఉపాధ్యాయుడితో హిందుస్థాన్ టైమ్స్ తెలుగు మాట్లాడగా... పై అంశాలనే ప్రధానంగా ప్రస్తావించారు. 317 జీవో, బదిలీలు, 1వ తేదీన జీతాల విషయంలో అసంతృప్తి ఉన్నట్లు చెప్పారు. తమ సమస్యలపై ఏవీఎన్ రెడ్డి గట్టిగా పోరాడుతారనే నమ్మకంతో పాటు... టీచర్ల సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ సందేశం పంపాలన్న ఉద్దేశ్యం కూడా తమలో ఉందని చెప్పుకొచ్చారు.

మొత్తంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డి గెలుపు.. బీజేపీకి సరికొత్త బూస్ట్ ఇచ్చినట్లు అయింది. ఈ విక్టరీపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు... బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం కాబోతుందన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలనపై ఉపాధ్యాయ మహాశయులు అద్భుతమైన తీర్పునిచ్చారని అన్నారు. ఇక పలువురు బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ… అసలుఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఎవరికి మద్దతు ఇవ్వలేదని.. ఎలాంటి ప్రచారం కూడా చేయలేదని చెప్పుకొస్తున్నారు. తమపై ఉపాధ్యాయుల్లో ఎలాంటి వ్యతిరేక లేదని ప్రస్తావిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం