BJP Vs TRS : బీజేపీ-టీఆర్ఎస్ మిత్రుత్వం నుంచి శత్రుత్వం వరకూ ఏం జరిగింది?-bjp and trs from allies to arch enemies know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Vs Trs : బీజేపీ-టీఆర్ఎస్ మిత్రుత్వం నుంచి శత్రుత్వం వరకూ ఏం జరిగింది?

BJP Vs TRS : బీజేపీ-టీఆర్ఎస్ మిత్రుత్వం నుంచి శత్రుత్వం వరకూ ఏం జరిగింది?

Anand Sai HT Telugu
Jul 03, 2022 02:40 PM IST

దేశవ్యాప్తంగా అందరి చూపు.. ఇప్పుడు హైదరాబాద్ వైపే ఉంది. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరగడంతోపాటుగా.. ఆ పార్టీకీ టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చేలా చేస్తున్న ప్లాన్స్ తో అందరి దృష్టి ఉంది. మెుదట్లో మిత్రుత్వంగా ఉన్న ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ శత్రుత్వం ఎలా పెరిగింది?

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఐదు సంవత్సరాల క్రితం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరచుగా పార్లమెంటులో కీలక అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయి. నువ్వా నేనా అన్నట్టుగా పోరు నడుస్తోంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. ఇదే సమయంలో.. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సైతం.. హైదరాబాద్ వచ్చారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు దీటుగా.. టీఆర్ఎస్ సైతం ప్రచారం చేస్తోంది. పెద్ద ఎత్తున ర్యాలీగా తీసుకెళ్లారు. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా.. కాషాయ, గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. హోర్టింగులు, ఫ్లెక్సీలు హైదరాబాద్ అంతటా కనిపిస్తున్నాయి. బీజేపీకి దీటుగా.. టీఆర్ఎస్ .. ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే.. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. మోదీ వచ్చిన రోజునే సిన్హా ఇక్కడికి రావడం కేసీఆర్ వ్యూహంలోనే భాగమేనని.. అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

దేశ వ్యాప్తంగా బీజేపీ ముఖ్యనేతలు అంతా.. వచ్చిన.. బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని "సర్కస్" అని టీఆర్‌ఎస్ అంటోంది. బీజేపీకి వ్యతిరేకంగా.. కేసీఆర్ చాలా రోజుల నుంచి పోరు చేస్తున్నారు. మరోవైపు 2014 నుంచి ఒక్కో రాష్ట్రంలో.. పాగా వేసేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ మిత్రపక్షం నుంచి.. ప్రత్యర్థిగా మారింది.

2019లో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా కాషాయ పార్టీకి వ్యతిరేకంగా మారుతూ వచ్చింది టీఆర్ఎస్. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ కూడా బీజేపీ మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతోందన్న క్రమంలో.. మెల్లగా దూరం అవుతూ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటున్న బీజేపీ నేతలు సైతం.. కేసీఆర్ కు కాషాయ పార్టీ ఎదుగుతోందని భయం పట్టుకుందని ఆరోపిస్తున్నారు.

2019 పార్లమెంటరీ ఎన్నికలకు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే గెలిచారు. ఆ తర్వాత నాలుగు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ బలహీనపడటంతో ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేందుకు.. బీజేపీ వ్యూహాలు రచించింది. ఇదే కేసీఆర్ కు కోపం తెప్పించినట్టుగా తెలుస్తోంది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీనే గెలిచింది. జీహెచ్ఎంసీలోనూ.. అధిక సీట్లు సాధించింది. ఇక అప్పటి నుంచే.. బీజేపీకి టీఆర్ఎస్ దూరమైనట్టుగా కనిపిస్తోంది. పార్టీ ఎదుగుదల టీఆర్‌ఎస్‌ను కలవరపెడుతుందని బీజేపీ నేతలు అంటున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించడంతో.. పోరు ఇంకాస్త పెరిగినట్టుగా కనిపిస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పుంజుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దిల్లీ వెలుపల పార్టీ కీలక జాతీయ సమావేశాన్ని నిర్వహించడం ఇది నాలుగోసారి మాత్రమే. గతంలో 2017లో ఒడిశా, 2016లో కేరళ, 2015లో బెంగళూరులో సమావేశాలు నిర్వహించారు.

అక్కడ తమ ఉనికిని పెంచుకోవడం కోసం బీజేపీ ఈ రాష్ట్రాలన్నింటినీ ఎంచుకుంది. కర్నాటకలో కాంగ్రెస్‌ను అధికారం నుండి దించగలిగినప్పటికీ, ఒడిశాలో పరిమిత విజయాన్ని మాత్రమే సాధించింది. కేరళలో మాత్రం.. ఆశించిన స్థానాలు రాలేదు. ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలగైనా.. గెలవాలని అనుకుంటోంది. తెలంగాణలో బీజేపీ పార్టీ పురోగతి ఏ పథంలో సాగుతుందో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

తెలంగాణ అవతరణతో కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలతో పాటు పెద్దగా రాజకీయ వైరానికి దిగిన ఘటనలు లేవు. రెండోసారి కేసీఆర్​ సీఎం అయ్యాక పరిస్థితులు మారాయి. వరిధాన్యంతో మొదలైన పోరు.. ఉద్యోగుల బదిలీలు, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యల వంటి అంశాలతో మరింత రాజుకుంది. ధాన్యం సేకరణపై చాలా రోజులు వార్ నడిచింది. దిల్లీకి వెళ్లి మరీ.. నిరసన తెలిపింది టీఆర్ఎస్.

మరోవైపు.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీని ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి తీసుకెళ్లినట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ పాలనపై ప్రజావ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందనే అనుకునేలోపు.. బీజేపీ పుంజుకుంటోంది. అయితే కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా.. నిరసనలు తెలుపుతూనే ఉంది. బీజేపీ-టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్