GHMC Council Meeting : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస - బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మేయర్‌-bjp and brs corporators protest in ghmc council meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ghmc Council Meeting : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస - బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మేయర్‌

GHMC Council Meeting : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస - బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మేయర్‌

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 30, 2025 12:40 PM IST

GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా సాగింది. కాంగ్రెస్‌ హామీలు నెరవేర్చడంలేదంటూ ఫ్లకార్డులతో బీఆర్ఎస్‌ సభ్యుల నిరసనకి దిగారు. మేయర్ పోడియం వద్దకు వెళ్లేందుకు యత్నించారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు కూడా నిరసన చేపట్టారు. జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

GHMC కౌన్సిల్ సమావేశంలో రసాభాస
GHMC కౌన్సిల్ సమావేశంలో రసాభాస

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మేయర్‌ విజయలక్ష్మి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. బడ్జెట్ సందర్భంగా…. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఏకపక్షంగా బడ్జెట్ పై చర్చ లేకుండా ఏ విధంగా ఆమోదిస్తారని ప్రశ్నించారు.

yearly horoscope entry point

కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మేయర్‌ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా యత్నించారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో రసాభాస మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? - కేటీఆర్

ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్పొరేటర్లను అరెస్ట్ చేయటానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్‌లను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయలేదు. మరోసారి అవే కాగితాలపైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా? పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజావసరాలను కూడా సరిగ్గా నిర్వహించటం లేదు. జిహెచ్ఎంసి అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు” అని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ కార్పొరేటర్ల నిరసన…

మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. భిక్షాటన చేస్తూ పలువురు కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయంకు చేరుకున్నారు. జీహెచ్ఎంసీ పరిస్థితి ఘోరంగా ఉందని విమర్శించారు. తమ డివిజన్లకు నిధులు కేటాయించటం లేదని ఆరోపించారు.

Whats_app_banner

సంబంధిత కథనం