తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వేలాది కోళ్లు మృత్యువాతపడ్డాయి. గత నాలుగు రోజుల కిందట కోళ్ల రక్త నమూనాలను సేకరించి, బర్డ్ ఫ్లూ అని నిర్దారించారు అధికారులు. కోట్లలో ఆస్థి నష్టం వాటిళ్లింది. దీంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. చనిపోయిన కోళ్లను జేసీబీతో గుంత తీసి పూడ్చి పెట్టారు. కోడి గుడ్లు కూడా ఎవరికి అమ్మొద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు.
బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోళ్ల మాంసం, గుడ్లను తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల వచ్చే ఒక ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తుంది, కానీ కొన్నిసార్లు మనుషులకు కూడా సోకుతుంది. బర్డ్ ఫ్లూ లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మరింత తీవ్రంగా ఉంటాయి.
బర్డ్ ఫ్లూ సోకిన పక్షులకు జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే, పక్షులతో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, కోడి మాంసం, గుడ్లను బాగా ఉడికించి తినడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మరణించింది. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరించింది. మార్చి 16న బాలిక మృతి చెందగా.. పరీక్షల్లో బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. చిన్నారికి H5N1 వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. పచ్చి కోడి మాంసం తినడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చిన్నారి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై కేంద్ర వైద్య బృందం అధ్యయనం చేస్తోంది. చిన్నారికి సన్నిహితంగా ఉన్నవారి రక్త నమూనాలను పరీక్షించగా.. ఎవరికీ వైరస్ సోకలేదని నిర్ధారణ అయింది. బర్డ్ ఫ్లూతో పాటు లెప్టోస్పైరోసిస్ కూడా బాలికకు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సంబంధిత కథనం