Bird Flu in Nalgonda : తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు!-bird flu scare in gundrampally village of chityala mandal in nalgonda district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bird Flu In Nalgonda : తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు!

Bird Flu in Nalgonda : తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు!

Bird Flu in Nalgonda : తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఓ పౌల్ట్రీ ఫామ్‌లో రెండు లక్షల కోళ్లు ఉండగా.. కొన్నింటికి బర్డ్ ఫ్లూ వచ్చినట్లు అధికారులు నిర్థారించారు. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను పౌల్ట్రీ రైతులు చంపేశారు. 30 వేల కోళ్లను చంపి పాతిపెట్టారు. పరిసర ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు.

బర్డ్ ఫ్లూ (unsplash)

తెలంగాణలో మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని ఫామ్‌లోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని అధికారులు నిర్ధారించారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ల ఫామ్‌లోనూ.. 500 కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి, దీంతో 52 వేల కోళ్లు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు అధికారులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ కారణంగా నష్టాల్లో కూరుకుపోతున్నామని.. కోళ్ల ఫారం యజమానులు, మాంసం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

మనుషులకు కూడా..

ఇటీవల సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. దీంతో అధికారులు అలర్ట్ అయి.. నివారణ చర్యలు చేపట్టారు. రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల వచ్చే ఒక ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్నిసార్లు మనుషులకు కూడా సోకుతుంది. బర్డ్ ఫ్లూ లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో మరింత తీవ్రంగా ఉంటాయి.

లక్షణాలు..

జ్వరం.. సాధారణంగా 100°F (38°C) కంటే ఎక్కువ ఉంటుంది. పొడి దగ్గు లేదా రక్తంతో కూడిన దగ్గు కూడా రావచ్చు. గొంతులో మంట, నొప్పిగా ఉంటుంది. కండరాల నొప్పులు, శరీరం మొత్తం నొప్పులు వస్తాయి. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. కడుపులో వికారం, వాంతులు అవుతాయి. విరేచనాలు అవుతాయి. కళ్లు ఎర్రబడతాయి. నీరు కారుతాయి. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో బర్డ్ ఫ్లూ న్యుమోనియా, శ్వాసకోశ వైఫల్యం, ఇతర ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు.

నివారణ చర్యలు..

పౌల్ట్రీ ఫారమ్‌లలో కఠినమైన బయోసెక్యూరిటీ ప్రోటోకాల్‌లను అమలు చేయాలి. పౌల్ట్రీ కేంద్రాలను క్రిమిసంహారక చేయడం, చనిపోయిన పక్షుల మృతదేహాలను సరిగ్గా పాతిపెట్టాలి. పక్షుల నమూనాలను సకాలంలో సేకరించి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. పౌల్ట్రీ కార్మికులకు, పక్షులతో దగ్గరగా ఉండే ప్రజలకు టీకాలు వేయాలి. బర్డ్ ఫ్లూ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలను అభివృద్ధి చేశారు.

జాగ్రత్తలు..

బర్డ్ ఫ్లూ వ్యాప్తిని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. పశుసంవర్ధక శాఖ అధికారులు పౌల్ట్రీ ఫారమ్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ప్రజలకు బర్డ్ ఫ్లూ గురించి అవగాహన కల్పించాలి. పక్షులు ఎక్కడ చనిపోతున్నా.. వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాలి. పెంపుడు పక్షులను అడవి పక్షులకు దూరంగా ఉంచాలి. పక్షుల వ్యర్థాలను శుభ్రం చేసేటప్పుడు గ్లవ్స్‌, మాస్క్‌లు ధరించాలి.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం