Jitta Balakrishna Reddy : జిట్టా అడుగులు కాంగ్రెస్ వైపు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ!
Jitta Balakrishna Reddy : బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి కాంగ్రెస్ చేరనున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోకాలడ్డినా జిట్టా చేరిక అనివార్యం అయింది. తాజాగా జిట్టా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
Jitta Balakrishna Reddy : తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైంది. నెల రోజుల కిందట ఆయన బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఈసారి ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని భావించిన జిట్టాకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో ఆటంకం ఎదురైంది. జిట్టా చేరికను పెండింగులో పెట్టడంతో నెల రోజులకు పైగా ఎదురుచూసిన ఆయన చివరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో భువనగిరి కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కాయి.
చర్చనీయాంశంగా జిట్టా రాజకీయం
గడిచిన కొద్ది నెలలుగా భువనగిరి కేంద్రంగా జిట్టా రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. 2009, 2014, 2018 ఎన్నికల్లో వరసగా ఇండిపెండెంటుగా పోటీ చేసి ఓటమి పాలైన జిట్టా బాలక్రిష్ణారెడ్డి ముందుగా బీఆర్ఎస్ నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఆ పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షునిగా కూడా పనిచేశారు. కానీ, టికెట్ అవకాశం రాక ఇండిపెండెంటుగా పోటీకి దిగారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఆయన వైఎస్ మరణం తర్వాత ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వెంట నడిచి వైఎస్సార్ కాంగ్రెస్ లో పచేశారు. వైఎస్ జగన్ పార్లమెంటులో తెలంగాణ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడంతో ఆ పార్టీనీ వీడి సొంతంగా యువ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2018 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో తన పార్టీ తరపునే పోటీ చేసినా మూడోసారి కూడా ఓడిపోయారు. కొన్నాళ్ల తర్వాత ఆయన తన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీలో గుర్తింపు లేదని, ఆ పార్టీ బీఆర్ఎస్ తో ములాఖత్ అయ్యిందని విమర్శలు చేసి సస్పెన్షన్ గురయ్యారు. ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామంతో జిట్టా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తి నెలకొంది. ఆయన కాంగ్రెస్ లో చేరడానికి విశ్వప్రయత్నం చేశారు.
రక్తికడుతున్న కాంగ్రెస్ రాజకీయం
భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో తనకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ డీసీసీ అధ్యక్షునిగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా భువనగిరి నుంచి పోటీ చేశారు. కుంభం అనిల్ పార్టీని వీడడంతో భువనగిరి కాంగ్రెస్ లో ఖాళీ ఏర్పడింది. ఈ స్థానాన్ని తాను భర్తీ చేయొచ్చని జిట్టా బాలక్రిష్ణారెడ్డి భావించారు. కానీ ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి కోమటిరెడ్డి ఎందుకనో మీన మేషాలు లెక్కపెట్టారు. ఈ లోగా తాను అనుకున్న వ్యక్తికి డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టేలా చక్రం తిప్పిన కోమటిరెడ్డి ఇక్కడి నుంచి ఇద్దరు బీసీ నాయకులను పెట్టుకున్నారు. రామాంజనేయులు గౌడ్, శివరాజ్ గౌడ్ లను ఇద్దరినీ ప్రోత్సహించడం మొదలు పెట్టారు. వీరిలో ఎవరికి టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారో కానీ, ఇద్దరినీ పనిచేసుకొమ్మని పురమాయించారు. కానీ ముందు నుంచీ తనతో సత్సంబంధాలు ఉన్న జిట్టా చేరికకు మాత్రం పచ్చజెండా ఊపలేదు.
రేవంత్ తో భేటీ అయిన జిట్టా
కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను ఇక పట్టించుకోవడం లేదన్న అభిప్రాయానికి వచ్చిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఆయనతో అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తన సహచరుడు, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిశారు. తెలంగాణ ఉద్యమ కారులు, ముఖ్యంగా సీఎం కేసీఆర్ వ్యతిరేకులను ఏకం చేసే పనిలో ఉన్న రేవంత్ ఈ ఇద్దరు నేతలతో భేటీ కావడం చర్చకు తెరలేపింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంగీకారం, అనుమతితో నిమిత్తం లేకుండానే నేరుగా ఏఐసీసీ నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరడానికి జిట్టా సుముఖత చూపారని సమాచారం. గతంలో ఇదే తరహాలో నకిరేకల్ నాయకుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ చేరికను సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాగే అడ్డుకోగా, ఆయన నేరుగా దిల్లీలో ఏఐసీసీ నాయకుల సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీకి ఉపయోగపడతారనున్న నాయకులను చేర్చుకోవడానికి మోకాలడ్డుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ వర్గాల్లో, జిట్టా అనుచర వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. కాగా సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా జిట్టా బాలక్రిష్ణారెడ్డి కాంగ్రెస్ కండువాను కప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.