సుందరీమణుల మనసు దోచుకున్న భూదాన్ పోచంపల్లి- ఇక్కత్ చీరల డిజైన్ లు చూసి ఆశ్చర్యం-bhoodan pochampally ikat sarees exquisite designs that capture miss world contestants hearts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సుందరీమణుల మనసు దోచుకున్న భూదాన్ పోచంపల్లి- ఇక్కత్ చీరల డిజైన్ లు చూసి ఆశ్చర్యం

సుందరీమణుల మనసు దోచుకున్న భూదాన్ పోచంపల్లి- ఇక్కత్ చీరల డిజైన్ లు చూసి ఆశ్చర్యం

మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు...భూదాన్ పోచంపల్లి చేనేత పార్క్ ను సందర్శించారు. ప్రత్యేకమైన ఇక్కత్ చీరల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. చీరలపై భిన్న డిజైన్లను గమనించిన అతిథులు, కొందరు స్వయంగా రాట్నంతో నూలు వడికే ప్రయత్నం చేశారు.

సుందరీమణుల మనసు దోచుకున్న భూదాన్ పోచంపల్లి- ఇక్కత్ చీరల డిజైన్ లు చూసి ఆశ్చర్యం

సాంస్కృతిక వారసత్వం, ఇక్కత్ చీరల నేతకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామ చేనేత పార్క్ ఈసారి అంతర్జాతీయ సుందరీమణుల మన్ననలు పొందింది.

గురువారం ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు ఈ గ్రామాన్ని సందర్శించి, స్థానిక సంస్కృతి, కళలతో, మ్యూజిక్ తో మమేకమయ్యారు. సిందూరం, సంగీతం, చేతినేతల మధ్య కళాత్మకమైన ఈ సందర్శనం అతిథుల హృదయాలను రంజింపజేసింది.

సంప్రదాయ స్వాగతం

భూదాన్ పోచంపల్లి గ్రామ చేనేత పార్క్ ప్రవేశద్వారం వద్దే స్థానికులు సంప్రదాయ దుస్తుల్లో కంటెస్టెంట్లకు స్వాగతం పలికారు. సిందూరం నుదుట దిద్ది, పువ్వుల మాలలు అందిస్తూ "పోచంపల్లికి హృదయపూర్వక స్వాగతం" అంటూ అందగత్తెలకు హృదయాలను హత్తుకునేలా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్క్ మ్యూజియంలోని స్టాల్ లను సందర్శించారు.

ఇక్కత్ చీరల రహస్యాలు

ప్రత్యేకమైన ఇక్కత్ చీరల తయారీ విధానాన్ని స్థానిక పార్కులో పరిశీలించిన అతిథులు, నూలు వడకడం నుంచి రంగులు చొప్పించే క్లిష్టమైన ప్రక్రియలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఒక్క చీరకు వారాలు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకతవ కంటెస్టెంట్ లను మనస్సును హత్తుకుంది. చీరలపై భిన్న డిజైన్లను గమనించిన అతిథులు, కొందరు స్వయంగా రాట్నంతో నూలు వడికే ప్రయత్నం చేశారు.

లయబద్ధ నాట్యాలు

స్థానిక కళాకారులు ప్రదర్శించిన కిన్నెర, డప్పు వాయిద్యాల మధుర సంగీతం అందగత్తెలను మంత్రముగ్ధుల్ని చేసింది. కొందరు కంటెస్టెంట్ లు స్వయంగా కిన్నెర, డప్పు వాయించగా, మరికొందరు సంగీత లయకు అనుగుణంగా నాట్యం చేశారు.

చేతుల మెహందీ, చేతితో రాట్నం

సందర్శన కంటెస్టెంట్ లు స్థానిక కళాకారుల నుంచి మెహందీ టాటూలు వేయించుకున్నారు. అరిచేతులపై నెమలి సోయగం, నాజూకైన నక్షత్రాలు, పువ్వుల డిజైన్లతో మురిసిపోయిన బ్యూటీలు ఫొటో సెషన్లకు పోజ్ ఇచ్చారు. రాట్నంతో నూలు వడికే విధానాన్ని సుందరీమణులు పరిశీలించారు. కొంత మంది స్వయంగా రాట్నం ఒడికి మురిసిపోయారు.

చివరగా అంపి థియేటర్లో భూదాన్ పోచంపల్లి ప్రస్థానం, హ్యాండ్లూమ్‌పై ప్రత్యేక వీడియోను మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లకు ప్రదర్శించారు.

చక్కని ఏర్పాట్లు

మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ల రూరల్ టూర్ నిర్వహించడంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న జిల్లా యంత్రాగం స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం, సమన్వయంతో

జిల్లా కలెక్టర్ ఎం హనుమంత రావు నేతృత్వంలో పోచంపల్లి గ్రామ చేనేత పార్క్ లో ప్రపంచ అందాల రాయబారుల కోసం చక్కని ఏర్పాట్లు చేశారు. చేనేత పార్క్ కు ప్రపంచానికి పరిచయం చేసేలా వరల్డ్ టూరిజం లో ప్రత్యేక గుర్తింపు దక్కేలా చక్కగా ప్రమోట్ చేశారు.

అసూయపుట్టేలా ఫ్యాషన్ షో

ప్రపంచ అందగత్తెలకే అసూయ పుట్టేలా భారతీయ నారిమణుల ఇక్కత్ చీరల ఫ్యాషన్ షో అద్భుతం గా సాగింది. సంప్రదాయం ఉట్టిపడేలా ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో ఆత్మవిశ్వాసం నింపుకున్న యువతులు అంపీ థియేటర్ వేదికగా జోష్ నింపారు. షో జరుగుతున్నంత సేపు ప్రపంచ అందగత్తెలు కళ్లార్పకుండా చూస్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు.

షో చివరలో ఫ్యాషన్ షో లో పాల్గొన్న యువతులను మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు కలసి అభినందించారు. స్థానికులు ఈ షో ను ఆసక్తిగా తిలకించారు. ఈ ఫ్యాషన్ షో స్థానికులకే కాదు.. అందగత్తెలకు సరికొత్త అనుభూతి మిగిల్చింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం