Bhim Army Chief : 'దళితబంధు' దేశానికే ఆదర్శం - భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్
BHIM Army Chief Meets CM KCR: 'దళితబంధు' సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్. శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన ఆజాద్... పలు అంశాలపై చర్చించారు.
BHIM Army Chief Meets CM KCR: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భీమ్ ఆర్మీ చీఫ్... ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. శుక్రవారం ప్రగతి భవన్ వేదికగా సాగిన వీరి భేటీలో పలు అంశాలపై చర్చించారు. సుధీర్ఘంగా సాగిన చర్చలో దేశంలో దళితుల పరిస్థితి, దళితుల పట్ల పాలకులు అనుసరిస్తున్న వైఖరులు, దళితులపై దేశంలో అమలవుతున్న దమనకాండ వంటి పలు అంశాలకు చర్చకు వచ్చాయి.
ట్రెండింగ్ వార్తలు
ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ... తెలంగాణలో అమలవుతున్న దళిత అభివృద్ధి కార్యాచరణ భవిష్యత్ లో దేశంలోని దళితుల సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితబంధు పథకం దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో అమలవుతున్న పథకమని స్పష్టం చేశారు. దళితబంధు విజయగాథలను తాను తెలుసుకున్నానని, వారి జీవితాల్లో గుణాత్మక మార్పు ప్రారంభమైందని అన్నారు. ఇది ఎంతో గొప్ప విషయమని ఆజాద్ చెప్పారు. అట్టడుగు స్థాయిలో పనిచేసే దళితుల సాధికారతకు తోడ్పడుతూ, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న దళితబంధు పథకం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతుందన్నారు.
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిగడ్డపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ పట్ల ఉన్న అభిమానానికి, వారి ఆశయాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిదన్నారు. దళిత, బహుజన, పీడిత వర్గాల ప్రగతి లక్ష్యంగా పాలనను అందించే ప్రజాస్వామిక సౌధంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయాన్ని నిర్మించడం వెనక సీఎం కేసీఆర్ దార్శనికత మహోన్నతమైనదన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్నంత గొప్పగా గురుకుల విద్య దేశంలో మరెక్కడా అమలు కావట్లేదన్నారు ఆజాద్. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ బిడ్డలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించే మహోన్నత లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న వందలాది గురుకులాలు ప్రపంచ జ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయన్నారు. దేశ విదేశాల్లో దళితబిడ్డలు చదువుకునే దిశగా ఆర్థిక సహాయం అందిస్తూ, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని అమలుచేస్తున్న విషయం తాను తెలుసుకున్నానని, ఈ పథకం సహాయంతో ఇప్పటికే ఎంతోమంది దళిత బిడ్డలు విదేశాల్లో విద్యనభ్యసిస్తుండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి అమలు తీరు దేశంలోని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాల్సి ఉందని ఆజాద్ తెలిపారు. దళిత జనబాంధవుడిగా నిలిచిన సీఎం కేసీఆర్ కు తన ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.
మహాసభలకు ఆహ్వానం:
రాజస్థాన్ లోని జైపూర్ లో ఆగష్టు 26న జరిగే భీమ్ ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను చంద్రశేఖర్ ఆజాద్ ఆహ్వానించారు.