Bhadrachalam Temple : భద్రాద్రి సీతారాముల ఆలయానికి కొత్త శోభ, తిరుమల తరహాలో అభివృద్ధికి అడుగులు-bhadradri sita ram temple gets new look development on tirumala lines ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadrachalam Temple : భద్రాద్రి సీతారాముల ఆలయానికి కొత్త శోభ, తిరుమల తరహాలో అభివృద్ధికి అడుగులు

Bhadrachalam Temple : భద్రాద్రి సీతారాముల ఆలయానికి కొత్త శోభ, తిరుమల తరహాలో అభివృద్ధికి అడుగులు

HT Telugu Desk HT Telugu

Bhadrachalam Temple : దక్షిణ అయోధ్య భద్రాద్రి సీతారాముల ఆలయం నూతన శోభను సంతరించుకోనుంది. తిరుమల ఆలయం తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ అభివృద్ధికి భూసేకరణకు ప్రభుత్వం రూ.34 కోట్లు విడుదల చేసింది.

భద్రాద్రి సీతారాముల ఆలయానికి కొత్త శోభ, తిరుమల తరహాలో అభివృద్ధికి అడుగులు

Bhadrachalam Temple : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయం ఇక నూతన శోభను సంతరించుకోనుంది. అనాదిగా అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఈ దేవాలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి పరిచేందుకు అడుగులు పడుతున్నాయి. వచ్చే నెలలో శ్రీ రామనవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి పూనుకుంది. భద్రాద్రి రామయ్య అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిన భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భద్రాద్రి ఆలయ భూ సేకరణ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సీఎం రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన భూ సేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మలను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూ. 34 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దక్షిణ అయోధ్య అయిన భద్రాద్రి భవిష్యత్తులో టెంపుల్ సిటీగా రూపుదిద్దుకునేందుకు అడుగులు పడనున్నాయి.

అడిగిందే తడవుగా

రెండ్రోజుల కిందట భద్రాద్రి ఆలయ ఈవోతో పాటు పండితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి భద్రాచల సీతారామ చంద్రస్వామి శ్రీ రామనవమి వేడుకలకు హాజరు కావాల్సినదిగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గతంలో భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను సీఎంకు వివరించారు. అభివృద్ధి పనులకు భూసేకరణ అడ్డంకిగా మారిందని తుమ్మల సీఎంకు వివరించారు.

భూసేకరణ పనులు పూర్తి చేస్తే భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదని భద్రాద్రి ఆలయం భక్తులతో మరింత శోభిల్లుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తుమ్మల చొరవతో సీఎం రేవంత్ రెడ్డి భూసేకరణకు కావలసిన నిధులను ఆ మరుసటి రోజే విడుదల చేసి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇక నవ భద్రాద్రి

భారతదేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచల దేవాలయ అభివృద్ధికి ఇక వేగంగానే అడుగులు పడుతున్నాయి. అనేక ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూ సేకరణ సమస్యకు ఎట్టకేలకు మంత్రి తుమ్మల పరిష్కారం చూపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నవ భద్రాద్రి దిశగా తుమ్మల కృషి చేస్తున్నారు. భూ సేకరణ తరువాత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దక్షిణ అయోధ్యగా భద్రాద్రి ఆలయ కీర్తి ధ్వనించేలా అభివృద్ధి చేయనున్నారు.

నమూనాలు సిద్ధం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో భద్రాద్రి ఆలయం నూతన శోభ సంతరించుకోనుంది. ఆగమ పండితులు రూపొందించిన నమూనాలు, సూచనల ప్రకారం అభివృద్ధి పనులను ప్రారంభించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. శరవేగంగా భూసేకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన షాపులు, ఇళ్లు షిఫ్టింగ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు.

శ్రీరామనవమి వేడుకల అనంతరం నమూనాల ప్రకారం అత్యద్భుతంగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. మంత్రి తుమ్మల చేతుల మీదుగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో ఎన్నాళ్లుగానో ప్రతిపాదనలకే పరిమితమైన భద్రాద్రి అభివృద్ధి కల సాకారం కానుంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి

HT Telugu Desk

సంబంధిత కథనం