Bhadradri News : పుట్టినరోజు వేడుకలు జరిగిన రెండ్రోజుల్లోనే, హార్ట్ ఎటాక్ తో 13 ఏళ్ల బాలిక మృతి
Bhadradri News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక కన్నుమూసింది. పుట్టినరోజు వేడుకల జరుపుకున్న రెండ్రోజుల్లోనే బాలిక మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Bhadradri News : ఇటీవల కాలంలో ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా... గుండెపోటు బారిన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా 13 ఏళ్ల బాలిక హార్ట్ ఎటాక్ తో కన్నుమూసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారంలో శుక్రవారం 13 ఏళ్ల నిహారికకు గుండెపోటు వచ్చింది. బాలికను కుటుంబసభ్యులు మణుగూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి మరింత విషమించడంతో భద్రాచలంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే బాలిక అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. బాలిక మరణాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఐదేళ్ల క్రితం అక్క కూడా ఇలానే
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు సర్వసాధారణమైపోయింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదమూడేళ్ల బాలిక గుండెపోటుతో కన్నుమూసింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామానికి చెందిన నారందాసు వెంకటేశ్వర్లు, లావణ్య దంపతుల పెద్ద కుమార్తె నిహారిక (13) శుక్రవారం రాత్రి కడుపునొప్పి వస్తోందని తల్లిదండ్రులకు తెలిపింది. అదే సమయంలో వాంతులు చేసుకోవడంతో వెంటనే బాలికను మణుగూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి, చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి భద్రాచలం తీసుకెళ్తుండగా ఒక్కసారిగా బాలిక కుప్పకూలింది. ఆసుపత్రికి చేరుకున్నాక వైద్యులు నిహారికను పరీక్షించి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ నెల 17వ తేదీ(బుధవారం) కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంది నిహారిక. పుట్టిన రోజు వేడుకలు జరిగిన రెండోరోజే బాలిక మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇదిలా ఉండగా ఆమె సోదరి కూడా ఐదేళ్ల క్రితం ఇలాగే మరణించినట్లు తెలుస్తోంది.
ఇటీవలె మరో ఘటన
చిన్న వయసులోనే గుండెపోటుతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పుట్టిన రోజు ఘనంగా చేసుకుందామనుకున్న టీనేజర్ గుండెపోటు కబలిచింది. కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌కు చెందిన సచిన్ ఇటీవలె పదో తరగతి పరీక్షల్లో పాస్ అయ్యాడు. పదిలో మంచి మార్కులు రావడంతో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇంతలో గుండెపోటుతో సచిన్ మృతి చెందాడు. కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. తెల్లవారితే బర్త్ డే వేడుకలు ఇంతలోనే సచిన్ మరణించాడని తెలిసి బంధువు తట్టుకోలేకపోయారు. నిండా పదహారేళ్లు కూడా లేని సచిన్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించడంతో స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.