Aswaraopet SI : భద్రాద్రి జిల్లాలో కలకలం రేపుతున్న ఎస్సై ఆత్మహత్యాయత్నం, ఉన్నతాధికారుల వేధింపులే కారణమా?
Aswaraopet SI : అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎస్సై స్థాయి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారని పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు కారణం కావొచ్చని ప్రచారం జరుగుతోంది.

Aswaraopet SI : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. అందుకు ఉన్నతాధికారుల ఒత్తిడిలు, వేధింపులే కారణం అంటూ తన వాంగ్మూలంలో స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి మహబూబాబాద్ మార్కెట్ యార్డ్ సమీపంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ కొద్దిసేపటికి భార్యా, పిల్లలు గుర్తుకు రావడంతో బతకాలనే కోరికతో ఆయనే స్వయంగా 108 సిబ్బందికి ఫోన్ చేసి తాను పురుగుల మందు తాగినట్లు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది ఆయనను తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ కూడా మెరుగైన వైద్య సదుపాయం అందని పరిస్థితి నెలకొనడంతో ఎస్సై శ్రీనివాస్ ను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉన్నతాధికారుల వేధింపులే కారణమా?
ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేయడానికి ఉన్నతాధికారుల వేధింపులే అసలు కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం భద్రాద్రి జిల్లా పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. సీఐగా పని చేస్తున్న జితేందర్ రెడ్డి వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. సీఐ జితేందర్ రెడ్డి కానిస్టేబుళ్ల ఎదుటే తనను ఘోరంగా అవమానించేవాడని, తనను ఒక అవినీతిపరుడిగా చిత్రీకరించారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై డీఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదని వాపోయినట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడే ముందే ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ తన వాంగ్మూలం ఫోన్లో రికార్డు చేసి భద్రపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సైను పరామర్శించడానికి పోలీసు వర్గాల్లోని కొందరు అధికారులు, సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి వెళుతున్నారు.
ఈ క్రమంలో ఆయన వారితో మాట్లాడుతూ తన మరణ వాంగ్మూలాన్ని తన వన్ ప్లస్ ఫోన్లో భద్రపరిచినట్లు చెబుతున్నారని స్పష్టమవుతుంది. అయితే ఆ ఫోన్ ప్రస్తుతం భద్రాద్రి జిల్లా ఎస్బీ అధికారుల ఆధీనంలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఎస్సై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన కోలుకుని బయటికి వస్తే ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా ఒక ఎస్సై స్థాయి అధికారి సాధారణ వ్యక్తుల మాదిరిగా ఆత్మహత్యాయత్నం చేయడం వెనుక బలమైన కారణాలే ఉండి ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. ఎస్సై ఆత్మహత్యాయత్నం వ్యవహారం రాష్ట్ర వ్యాప్త చర్చకు కారణమైనప్పటికీ దీనిపై భద్రాద్రి జిల్లా పోలీసులు మాత్రం మౌనంగా ఉన్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం