TG Cyber Crime : ప్రభుత్వ పథకాల పేరిట సైబర్ నేరగాళ్ల వల.. తస్మాత్ జాగ్రత్త!
TG Cyber Crime : అమాయకులను మోసం చేసేందుకు.. సైబర్ నేరగాళ్లు ప్రతీ సందర్భాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ పథకాలను వాడుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పథకాల గురించి అధికారులకు తప్ప ఎవరికీ వివరాలు చెప్పొద్దని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం 4 ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను జనవరి 26 నుంచి అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల దృష్టి ఈ ప్రభుత్వ పథకాలపై పడింది. గ్రామ సభల్లో ప్రకటిస్తున్న జాబితాలో పేర్లు రాని వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అనర్హులను గుర్తించి వారి ఫోన్లకు ప్రభుత్వం పంపుతున్నట్లు సైబర్ నేరగాళ్లు మెసేజ్ సెండ్ చేస్తున్నారు. ఇలా పంపించిన మెసేజ్‌లకు స్పందించిన వారికి వల విసురుతున్నారు.
అనర్హులే టార్గెట్..
అనర్హులకు కాల్ చేసి ఓటీపీ అడుగుతున్నారు. ఓటీపీ చెబితే వెంటనే రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇండ్లకు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాలకు అర్హులవుతారని నమ్మిస్తున్నారు. ఇల్లెందు పట్టణంలోని పలువురికి మెసేజ్‌లు రావడం కలకలం సృష్టించింది. వారు అప్రమత్తమై వెంటనే మెసేజ్ డిలీట్ చేయడంతో.. సైబర్ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఇటువంటి మెసేజ్‌లు చేయదని, ఓటీపీలు అడగదన్న విషయాన్ని గుర్తించాలి. తెలియని వారు మెసేజ్‌లపై క్లిక్ చేసి, ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉంది.
పథకాల కోసం పరుగులు..
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రామ సభలు జరుగుతున్నాయి. అనర్హులైనా పథకాల కోసం కొందరు దరఖాస్తు చేసుకుంటున్నారు. తమను కూడా అర్హులుగా గుర్తించాలంటూ గ్రామ సభల్లో వేడుకుంటున్నారు. ఇదే అవకాశంగా భావించిన సైబర్ నేరగాళ్లు.. అనర్హులను గుర్తించి వారి ఫోన్లకు మెసేజ్ పంపిస్తున్నారు. సంక్షేమ పథకాల కోసం పరుగులు తీస్తున్న ప్రజలు.. మెసేజ్‌లపై క్లిక్ చేసి, ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉంది.
ఇల్లెందు పట్టణంలో..
ఇల్లెందు పట్టణంలోని ఏడో వార్డులో ఇలా పలువురికి మెసేజ్‌లు వచ్చాయి. వారు ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్ శ్యామల మాధవి దృష్టికి తీసుకెళ్లారు. గమనించిన ఆమె అవి ఫేక్ మెసేజ్‌లు అని, ఇది కచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించారు. సంక్షేమ పథకాలను సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పొరపాటున లింకులు క్లిక్ చేసి.. ఓటీపీలు చెప్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
(రిపోర్టింగ్- కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)