డిజిటల్ అరెస్ట్ పేరుతో పెరుగుతున్న మోసాలు.. మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి-beware digital arrest fraud here is your protection guide ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  డిజిటల్ అరెస్ట్ పేరుతో పెరుగుతున్న మోసాలు.. మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

డిజిటల్ అరెస్ట్ పేరుతో పెరుగుతున్న మోసాలు.. మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

HT Telugu Desk HT Telugu

ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ డిజిటల్ అరెస్టు మోసాలు ఎలా జరుగుతాయి? వాటి నుంచి ఎలా కాపాడుకోవాలి? ఒకవేళ వాటి బారిన పడితే ఎలా స్పందించాలో ఇక్కడ తెలుసుకోండి.

డిజిటల్ అరెస్టు పేరుతో పెరుగుతున్న మోసాలు (HT_PRINT)

డిజిటల్ అరెస్టు పేరుతో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి నుంచి డబ్బులు గుంజుతున్నారు. హైదరాబాద్‌లో (మార్చి 2025), ఒక వ్యక్తి ఈ మోసంలో 3.5 లక్షలు కోల్పోగా, ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు.

ముంబైలో (మార్చి 2025), 86 ఏళ్ల వృద్ధురాలు డిజిటల్ అరెస్ట్ పేరుతో 20 కోట్లు మోసపోయారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ భయపెట్టి డబ్బులు బదిలీ చేయమని బలవంతం చేశారు.

గుర్గావ్‌లో (మార్చి 2025) ఒక వ్యక్తి చట్ట అమలు అధికారిగా చెప్పుకున్న వ్యక్తికి, భయంతో వ్యక్తిగత సమాచారం ఇచ్చాడు. నోయిడాలో (ఫిబ్రవరి 2025) ఒక కుటుంబం ఐదు రోజుల పాటు "డిజిటల్ అరెస్ట్"లో ఉంచబడి 1.10 కోట్లు కోల్పోయింది.

భారత ప్రభుత్వం (మార్చి 2025) డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లతో సంబంధం ఉన్న 87,000 కంటే ఎక్కువ వాట్సాప్ మరియు స్కైప్ ఖాతాలను బ్లాక్ చేసింది. బాధితులు సుమారు 210.21 కోట్లు కోల్పోయారని అంచనా.

మోసం ఇలా జరుగుతుంది

ఈ తరహా మోసంలో, బాధితులకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తాయి. తాము పోలీసు అధికారులు, సీబీఐ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులమని వారు చెబుతారు.

బాధితులు ఏదో నేరం చేశారని, వారిపై కేసు నమోదైందని, వెంటనే అరెస్టు చేస్తామని బెదిరిస్తారు. కొన్నిసార్లు, నకిలీ వీడియో కాల్స్ చేసి, పోలీసు యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తులను చూపిస్తూ బాధితులను మరింతగా భయపెడతారు.

తమ అరెస్టును నివారించడానికి లేదా కేసును పరిష్కరించడానికి వెంటనే డబ్బులు చెల్లించాలని వారు బాధితులను ఒత్తిడి చేస్తారు. వివిధ ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులు, గిఫ్ట్ కార్డులు లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బులు పంపమని డిమాండ్ చేస్తారు. భయానికి గురైన చాలా మంది నిజమని నమ్మి మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ

ఇలాంటి డిజిటల్ అరెస్ట్ మోసాల బారిన పడకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కొన్ని ప్రాథమికమైన కానీ కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

  1. మీకు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్‌ను వెంటనే తిరస్కరించండి. ఒకవేళ వారు మిమ్మల్ని బెదిరిస్తూ లేదా డబ్బులు అడుగుతూ మాట్లాడితే, వారి మాటలను ఏ మాత్రం నమ్మవద్దు.
  2. నిజమైన ప్రభుత్వ అధికారులు లేదా పోలీసు సిబ్బంది ఎప్పుడూ ఫోన్‌లో వ్యక్తిగత సమాచారం లేదా డబ్బులు అడగరు.
  3. మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లు, పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు లేదా ఇతర సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో లేదా ఇంటర్నెట్‌లో ఎవరితోనూ పంచుకోవద్దు. గుర్తుంచుకోండి, మీ వ్యక్తిగత సమాచారం మీ చేతుల్లోనే సురక్షితంగా ఉండాలి.
  4. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టి లేదా ఒత్తిడి చేసి ఆన్‌లైన్‌లో డబ్బులు పంపమని అడిగితే, ఎంత అత్యవసరమని చెప్పినా సరే, అస్సలు చెల్లించవద్దు. ఏదైనా చెల్లింపు చేసే ముందు దాని ప్రామాణికతను స్వతంత్రంగా ధృవీకరించుకోండి.
  5. మీకు ఏదైనా ఫోన్ కాల్ లేదా మెసేజ్ అనుమానాస్పదంగా అనిపిస్తే, వెంటనే సంబంధిత ప్రభుత్వ శాఖను లేదా మీ స్థానిక పోలీస్ స్టేషన్‌ను నేరుగా సంప్రదించి నిజానిజాలు తెలుసుకోండి.
  6. వారి అధికారిక వెబ్‌సైట్‌లు, అధీకృత ఫోన్ నంబర్ల ద్వారా మాత్రమే సమాచారం పొందడానికి ప్రయత్నించండి. మధ్యవర్తుల ద్వారా వచ్చే సమాచారాన్ని నమ్మవద్దు.
  7. మోసగాళ్లు మిమ్మల్ని భయపెట్టడానికి మరియు ఆందోళనకు గురిచేయడానికి ప్రయత్నిస్తారు. వారి బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి.
  8. ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌కు గురైతే, వెంటనే స్పందించడం చాలా ముఖ్యం. ఆలస్యం చేయడం వలన నేరగాళ్లను పట్టుకోవడం కష్టమవుతుంది. మీ డబ్బును తిరిగి పొందడం కూడా కష్టతరం కావచ్చు. ఒకవేళ మీరు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌కు గురైతే, వెంటనే మీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.
  9. ఫిర్యాదు చేసేటప్పుడు, మీకు వచ్చిన ఫోన్ కాల్ వివరాలు (నంబర్, సమయం), మోసగాళ్లు చెప్పిన విషయాలు, మీరు డబ్బులు పంపిస్తే వాటి వివరాలు, మీ వద్ద ఉన్న ఇతర ఆధారాలను పోలీసులకు తెలియజేయండి.
  10. మీ ఫిర్యాదును లిఖితపూర్వకంగా ఇవ్వడం ముఖ్యం. దాని రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు. తక్షణమే మీ సమీపంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేయండి.
  11. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయవచ్చు. భారత ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్ అయిన cybercrime.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, అక్కడ ఫిర్యాదు నమోదు చేసే విధానాన్ని అనుసరించవచ్చు. ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం వలన మీ కేసు జాతీయ స్థాయిలో నమోదు అవుతుంది. దర్యాప్తు ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

డా.కట్కూరి శ్రీనివాస్

-సైబర్ సెక్యురిటీ, న్యాయ నిపుణులు

9490934520

డా.కట్కూరి శ్రీనివాస్
డా.కట్కూరి శ్రీనివాస్
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.