Bettings Apps Case: రానా, ప్రకాష్‌ రాజ్‌, విజయ్ దేవరకొండ సహా 25మందిపై బెట్టింగ్‌ యాప్‌ కేసులు-betting app cases against 25 people including actors rana prakash raj vijay deverakonda ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bettings Apps Case: రానా, ప్రకాష్‌ రాజ్‌, విజయ్ దేవరకొండ సహా 25మందిపై బెట్టింగ్‌ యాప్‌ కేసులు

Bettings Apps Case: రానా, ప్రకాష్‌ రాజ్‌, విజయ్ దేవరకొండ సహా 25మందిపై బెట్టింగ్‌ యాప్‌ కేసులు

Sarath Chandra.B HT Telugu

Bettings Apps Case: హైదరాబాద్‌లో బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారం సినీ ప్రముఖల మెడకు చుట్టుకుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన బెట్టింగ్ యాప్స్‌ ప్రచారంపై పోలీసులు దృష్టి సారించడంతో పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. బెట్టింగ్ యాప్స్‌ వలలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారంలో సినీ నటులపై కేసులు నమోదు

Bettings Apps Case: బెట్టింగ్ యాప్స్‌ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆన్‌లైన్‌ వేదికలపై వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. బుధవారం మియాపూర్‌ పిఎస్‌ పరిధలో నమోదు చేసిన కేసులో 25మందిపై అభియోగాలు నమోదు చేశారు.

రెండ్రోజుల క్రితం బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న 11మందిపై కేసులు నమోదు చేయగా తాజాగా మియాపూర్‌ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.  25మందిపై బిఎన్‌ఎస్‌  సెక్షన్లతో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్‌,  ఐటీ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రానా దగ్గుబాటి,  విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. వీరంతా జంగిల్ రమ్మీ, ఏ23, యోలో 247, ఫెయిర్ ప్లే, జెట్‌ విన్‌ వంటి యాప్‌లను ప్రమోట్ చేశారు. 

సోషల్‌ మీడియాలో ఇన్‌‌ప్లూయెన్సర్లుగా ఉంటూ బెట్టింగ్‌ను ప్రమోట్ చేస్తున్న అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్‌, వసంతి కృష్ణన్‌, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్‌ ఖాన్‌, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేషాయాని సుప్రీత ఉన్నారు. సామాజిక కార్యకర్త ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు వీరిపై కేసులు నమోదు చేశారు.

యువతను మభ్య పెట్టి…

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్ చేసి యువతను తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సూచనలతో విశాఖపట్నానికి చెందిన యూ ట్యూబర్ లోకల్‌బాయ్‌ నానిపై మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదైంది.

యూట్యూబ్‌ వీడియోలను ప్రమోట్ చేసే ముసుగులో బెట్టింగ్‌ యాప్‌లకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగుల ద్వారా తాము విపరీతంగా ఆర్జించినట్టు వల వేస్తున్నారు. ప్రమోషనల్ కోడ్స్‌ రూపంలో యువతకు వల వేసి వారి బెట్టింగులు ఆడే డబ్బుల్లో ప్రమోట్ చేసినందుకు రిఫరల్‌ డబ్బులు పొందుతున్నారు. నాలుగైదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఆర్థిక నేరాలు చాపకింద నీరులా సాగుతున్నాయి.

మార్చి 17న నమోదైన కేసులో 11మందిపై పంజాగుట్ట పోలీసులు క కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ బాధితులు ముందుకు రావాలని  ఐపీఎస్ అధికారి సజ్జనార్ పిలుపునివ్వడంతో పాటు సోషల్‌ మీడియాలో   యూట్యూబ్ ట్రావెలర్ అన్వేష్ వంటి వారు కేసులు పెట్టాలని ప్రచారం చేస్తున్నారు. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. 

ఊబిలోకి లాగేలా వల వేస్తూ…

ఈ క్రమంలో బెట్టింగుల ఆడటం, డబ్బు పోగొట్టుకున్న తర్వాత పోయిన చోట వెదుక్కోవాలనే ధోరణితో అప్పుల పాలవడం, చివరకు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగాయి.

కొన్నేళ్లుగా బెట్టింగ్‌ యాప్‌‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బుల్లి తెర నటులు, సినీ ప్రపంచంలో అవకాశాలను వెదక్కుంటున్న యువతులు ఈ ఆర్థిక నేరాల్లో పాల్గొంటున్నారు.

వ్యవస్థీకృత ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారికి ప్రత్యక్షంగా సహకరిస్తున్న వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వందల,వేల కోట్ల లావాదేవీలతో ముడిపడి ఉన్నఈ వ్యవహారంలో వేలాదిమంది చిక్కుకుని వాటి నుంచి బయట పడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

లక్షల మందిపై బెట్టింగ్ వల…

ఈ క్రమంలో సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న 11మందిపై తాజాగా సిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన వారిలో అజయ్, కిరణ్‌ గౌడ్, బయ్యాసన్నీ యాదవ్, విష్ణుప్రియ, సుప్రీత, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్‌, రీతూ చౌదరి, టేస్టీ తేజ, సుదీర్‌ రాజు తదితరులు ఉన్నారు. వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేసి వాటి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తోన్న పలువురు సోషల్‌మీడియా, టీవీ నటులపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఇమ్రాన్‌ ఖాన్‌, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రీత, సుధీర్‌, అజయ్‌, సన్నీ యాదవ్‌, సందీప్‌ తదితరులపై కేసు నమోదు చేశారు. వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా సినీ నటులపై కూడా కేసులు నమోదు చేయడం కలకలం రేపుతోంది.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం