రాష్ట్రంలో గత కొంత కాలంగా బీసీ రిజర్వేషన్ల చుట్టు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ని తీసుకువచ్చింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ జీవోపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది.
తాజా పరిణామాలపై బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జీవోపై హై కోర్టు స్టే ఇవ్వడంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 14వ తేదీ రాష్ట్ర బంద్ కు పిలుపినిస్తూ బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్ కు పిలుపునిచ్చామని తెలిపారు. అందరూ కలసి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
నోటి దగ్గరికి వచ్చిన ముద్దను లాక్కునేందుకు విధంగా బీసీ రిజర్వేషన్లపై స్టే వచ్చిందని ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. తమకు జరిగిన అన్యాయానికి నిరసగా నిరసనగా అక్టోబర్ 14న బంద్ కు పిలుపునిస్తున్నామని చెప్పారు.
మరోవైపు జీవో 9, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి.
ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని ప్రభుత్వం కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. జనగణనతో పాటు ప్రభుత్వం చేపట్టిన చర్యల వివరాలను కూడా ప్రస్తావించనుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు రిజర్వేషన్‌ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనుంది.
మరోవైపు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం ఉండటంతో… పలువురు సుప్రీంకోర్టులో కేవియట్ కూడా దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదనలు కూడా వినాలని కోరారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని కెవియట్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే… అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే…. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించే జీవోకు పూర్తిస్థాయిలో బ్రేక్ పడినట్లు అవుతుంది.
సంబంధిత కథనం