Telangana Caste Census : తేలుతున్న బీసీల లెక్క....! మరో 'డిప్యూటీ సీఎం' రాబోతున్నారా..?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. కులాల వారీగా లెక్కలను తేల్చే పనిలో పడింది. ఇటీవలే ప్రాథమికంగా వివరాలను వెల్లడించగా.. మరోసారి కూడా సర్వేను నిర్వహించనుంది. అయితే ఈ సర్వే ప్రభావంతో.. బీసీ సామాజికవర్గానికి కీలకమైన పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగానూ కుల గణనపై విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో…. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా జనాల్లోకి తీసుకెళ్లింది. స్వయంగా రాహుల్ గాంధీ… పలు వేదికలపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే… కుల గణన చేపడుతామని చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ…. కుల గణన దిశగా అడుగులు వేసింది. దాదాపుగా ఈ ప్రక్రియ పూర్తి కూడా కావొచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే….
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. సుమారు 50 రోజుల పాటు కులగణన సర్వే జరిపింది. ఈ సర్వేలో 96.9 శాతం కుటుంబాలు తమ వివరాలు తెలిపాయి. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం ప్రకటించింది.
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మొత్తం 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్లు సర్కార్ తెలిపింది. అయితే ఇందులో 46.25 శాతం బీసీ జనాభానే ఉన్నట్లు నిర్థారించింది. అయితే బీసీ జనాభా 50 శాతానిపైగా ఉంటుందని… ప్రభుత్వం చెబుతున్న లెక్కలు సరిగా లేవని బీసీ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. హైదరాబాద్ లో సర్వే సమగ్రంగా జరగలేదని… చాలా మంది సర్వేలో పాల్గొనలేదని చెబుతున్నాయి. సమగ్ర సర్వేను మరోసారి నిర్వహించాలని… పక్కాగా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరోసారి సర్వే…..
బీసీ సంఘాలతో పాటు పలు రాజకీయపక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో…. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మరోసారి కుల గణన సర్వే నిర్వహించనుంది. గతంలో పాల్గొననని వారి నుంచి వివరాలను సేకరించనుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. మిగిలిన 3 శాతానికి పైగా ఉన్న వారి వివరాలను కూడా సేకరించి…. పూర్తిస్థాయిలో కుల గణన సర్వే గణాంకాలను ప్రకటించనుంది. వీటి ఆధారంగా బీసీల రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మెజార్టీ జనాభా బీసీలదే - కీలక పదవి ఉంటుందా..?
కుల గణనపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో… మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వస్తోంది. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా బీసీలే ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. అయితే వచ్చే స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఫలితంగా బీసీ వర్గాలకు మరింత దగ్గరవ్వాలని చూస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వంలో ఈ సామాజికవర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పలు సామాజికవర్గాలకు చెందిన మరికొంత మంది మంత్రులు ఉండగా.. ప్రస్తుతం ఆరు స్థానాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి.
కేబినెట్ విస్తరణ జరగాల్సి ఉంది. ఆరు ఖాళీల భర్తీపై చాలా రోజులుగా కసరత్తు జరుగుతోంది. అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే… పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వంలో మరోకరికి డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించాలనే అంశం తెరపైకి వస్తోంది. అది కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి ఇవ్వాలన్న చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. ఫలితంగా బీసీ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతోందని… ఆయా వర్గాలకు మరింత దగ్గర అవ్వొచ్చన్న అభిప్రాయం హస్తం పార్టీలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం బీసీ సామాజికవర్గం నుంచి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కేబినెట్ లో ఉన్నారు. అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధినాయకత్వం… రెండో డిప్యూటీ సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటే… వీరిలో ఒకరికి అవకాశం రావొచ్చన్న విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కులగణన లెక్కలు తేలుతున్న నేపథ్యంలో…. నిజంగానే రెండో డిప్యూటీ సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటారా..? లేక ప్రస్తుతం ఉన్న మాదిరిగానే కొనసాగిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి పూర్తిస్తాయిలో క్లారిటీ రాావాల్సి ఉంది….!
సంబంధిత కథనం