Fish Prasadam : ఈ నెల 9న చేప ప్రసాదం పంపిణీ.. కరోనా తర్వాత ఇదే తొలిసారి-bathini fish prasadam to be distributed at nampally exhibition grounds on 9th june 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bathini Fish Prasadam To Be Distributed At Nampally Exhibition Grounds On 9th June 2023

Fish Prasadam : ఈ నెల 9న చేప ప్రసాదం పంపిణీ.. కరోనా తర్వాత ఇదే తొలిసారి

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 10:05 AM IST

Bathini Fish Prasadam: ఈ నెల 9న మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. ఇందుకోసం తెలంగాణ సర్కార్… వివిధశాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది.

చేప ప్రసాదం పంపిణీ (ఫైల్ ఫొటో)
చేప ప్రసాదం పంపిణీ (ఫైల్ ఫొటో) (facebook)

Bathini Fish Prasadam Distribution: చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. మృగశిర కార్తె సందర్భంగా జూన్ 9వ తేదీ నుంచి ఈ ప్రసాదాన్ని ఉచితంగా బత్తిన సోదరులు పంపిణీ చేయనున్నారు. ఆస్తమాతో పాటు ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నవారితో పాటు చాలా మంది ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్యూ కడుతారు. హైదరాబాద్​లో ప్రతి ఏటా చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది. కరోనా వల్ల గత మూడేళ్లుగా పంపిణీకి బ్రేక్ పడింది. మళ్లీ ఈ ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

ఈనెల 9న మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. చేప ప్రసాదం కోసం మూడు రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్న హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారితో మంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని.... చేప ప్రసాదం పంపిణీ కి ఉమ్మడి రాష్ట్రంలో అరకొర ఏర్పాట్లు చేసేదని చెప్పుకొచ్చారు. ఫలితంగా చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. చేప ప్రసాదం కోసం గతంలో కంటే అధికంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బత్తిన హరినాద్ గౌడ్ కుటుంబ సభ్యులు 250 మంది చేప ప్రసాదం పంపిణీ చేస్తారని చెప్పారని, వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.

మత్స్య శాఖ ఆధ్వర్యంలో ..

అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేయనున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. బారికేడ్లు, విద్యుత్ సరఫరా, పోలీసు బందోబస్తు, తాగునీరు అందుబాటులో ఉంచుతామని వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ పలు చర్యలు తీసుకుంటుందని అన్నారు.

వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ల ఏర్పాటుతో పాటు అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇక్కడకు వచ్చే వారికి బద్రి విశాల్ పిట్టి, శ్రీకృష్ణ సమితి, అగర్వాల్ సమాజ్ వంటి పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనం ఉచితంగా అందిస్తాయని వివరించారు.

IPL_Entry_Point