Basara Devotees: భక్తులతో బాసర సరస్వతీ ఆలయం కిటకిట.. గోదావరిలోపుణ్య స్నానాలు, సామూహిక అక్షరాభ్యాసాలు-basara temple buzzes with activity holy dips in godavari and aksharabhyasams ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Basara Devotees: భక్తులతో బాసర సరస్వతీ ఆలయం కిటకిట.. గోదావరిలోపుణ్య స్నానాలు, సామూహిక అక్షరాభ్యాసాలు

Basara Devotees: భక్తులతో బాసర సరస్వతీ ఆలయం కిటకిట.. గోదావరిలోపుణ్య స్నానాలు, సామూహిక అక్షరాభ్యాసాలు

Basara Devotees: వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లి సరస్వతి కొలువైన బాసర పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రారంభమైన దర్శనాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. .

భక్తులతో కిటకిటలాడుతున్న బాసర సరస్వతీ ఆలయం

Basara Devotees:  వసంత పంచమి సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.  సోమవారం అర్థరాత్రి నుంచి భక్తులు అమ్మవారి దర్శనాల కోసం ఎదురు చేస్తున్నారు.  

చదువుల తల్లి సరస్వతి కొలువైన బాసర క్షేత్రం లక్షలాది  భక్తులతో  కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి పెద్ద సంఖ్యలో  భక్తులు తరలివచ్చారు. బాసరలో అక్షరాభ్యాసం చేస్తే  చదువుల తల్లి కరుణిస్తుందనే నమ్మకంతో  ఎక్కడెక్కడి నుంచో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మరోవైపు గోదావరిలో పుణ్యస్నానాలతో రద్దీగా మారింది. అమ్మవారి దర్శనంతో పాటు అక్షరాభ్యాసాల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అక్షరాభ్యాసాలతో నిమిత్తం లేకుండా ఆదివారం దాదాపు లక్ష మంది భక్తులు వచ్చి ఉంటారని దేవాదాయశాఖ అంచనా వేసింది. 

సోమవారం  భక్తుల రద్దీ మరింత పెరిగింది.  రైల్వేస్టేషన్‌కు  సమీపంలోనే వాహనాలను నిలిపి వేస్తుండడంతో భక్తులు కాలినడకన వెళ్లాల్సి వేస్తోంది. ఆలయానికి చేరుకోడానికి  భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చంటి పిల్లలతో వచచిన వారు,  వృద్ధులు కాలినడకన వెళ్లడం ఇబ్బందిగా మారింది. 

వసంతి పంచమి సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో ఈ ఏడాది ప్రభుతవ్ం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఆగిపోయినట్లు బాసర ఇన్ఛార్జి ఈవో సుధాకర్రెడ్డి వివరించారు. మరోవైపు వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని  నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు.  ఎస్పీ జానకి షర్మిల పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.