Basara IIIT Admissions: బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, జూన్ 1 నుంచి దరఖాస్తులు
Basara IIIT Admissions: తెలంగాణలోని ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయం బాసర క్యాంపస్‌లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
Basara IIIT Admissions: బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశాల కోసం జూన్ 1నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ విద్యార్ధులకు మెరుగైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.
నూజివీడు, ఇడుపులపాయ, బాసరలో ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో విడివిడిగా ప్రవేశాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని బాసర క్యాంపస్‌లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది.
బాసర క్యాంపస్‌లో అడ్మిషన్ల కోసం జూన్ 1 నుంచి 26 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు,ఆర్జీయూకేటీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ హైదరాబాద్‌లో వివరాలు వెల్లడించారు.
బాసర క్యాంపస్‌లో వివిధ బ్రాంచిలలో మొత్తం 1,500 సీట్లు అందుబాటులో ఉంటాయని వీసీ వివరించారు. బాసర క్యాంపస్‌లో ఉన్న మొత్తం సీట్లలో నాన్‌లోకల్ కోటాలో 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడవచ్చని స్పష్టం చేశారు.
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరేళ్ల బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్ధులు ఇంటర్ సమానమైన పియూసీ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ట్రిపుల్ ఐటీలో ఏడాదికి ఫీజు రూ.37 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఫీ రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్న వారు వాటిని చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.వెయ్యి, కాషన్ డిపాజిట్ రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700... మొత్తం రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ షెడ్యూల్…
- దరఖాస్తుల స్వీకరణ : జూన్ 1 నుంచి 26 సాయంత్రం 5 గంటల వరకు
- సీట్ల కేటాయింపు : జులై 3
- పత్రాల పరిశీలన : జులై 8 నుంచి 10 వరకు
- ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు 2024 మార్చిలో తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులుగా ప్రకటించారు. దరఖాస్తుదారుల వయసు జూన్1 నాటికి 18ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు 21ఏళ్ల వరకు మినహాయింపునిస్తారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5 శాతం సీట్లు సూపర్‌న్యూమరీ కింద కేటాయిస్తారు. అడ్మిషన్ విధివిధానాలు ఇతర నిబంధనలకు సంబంధించిన సమాచారం కోసం https://www.rgukt.ac.in/ లో చూడండి.
బాసర ఆర్జీయూకేటీలో బయో సైన్సెస్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్, ఫిజిక్స్, మేనేజ్మెంట్ విభాగాలు ఉన్నాయి.
ఇంటిగ్రేటెడ్ కోర్సుల్ని అందించే బాసర క్యాంపస్‌లో విద్యార్ధులకు అన్ని హంగులతో కూడిన సదుపాయాలు ఉన్నాయి కాన్ఫరెన్స్ హాళ్లు, సెంట్రల్ లైబ్రరీ, మెడికల్ సదుపాయం, బ్యాంకు ఏటిఎంలు, పోస్ట్ ఆఫీస్, స్పోర్ట్స్ సెంటర్, జిమ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. గ్రామీణ విద్యార్ధులను సాంకేతిక విద్యా రంగంలో ముందు నిలిపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ ఉంటుంది.