Barrelakka : ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరి...! మళ్లీ పోటీకి సై అంటున్న 'బర్రెలక్క'-barrelakka is ready to contest the parliament elections 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Barrelakka : ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరి...! మళ్లీ పోటీకి సై అంటున్న 'బర్రెలక్క'

Barrelakka : ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరి...! మళ్లీ పోటీకి సై అంటున్న 'బర్రెలక్క'

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 27, 2024 11:38 AM IST

Lok Sabha Elections 2024: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష అలియాస్ బర్రెలక్క… మరోసారి ఎన్నికల్లో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

 శిరీష అలియాస్ బర్రెలక్క
శిరీష అలియాస్ బర్రెలక్క

Barrelakka:బర్రెలక్క(కర్నె శిరీష)… మొన్నటి వరకు ఈ పేరు మార్మోగింది. ఉద్యోగాల భర్తీ విషయంలో బర్రెలను కాస్తూ ఆమె తీసిన ఓ వీడియో సంచలనంగా మారటంతో పాటు… రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారారు. ఈ విషయంలో ఆమెకు నిరుద్యోగుల నుంచి భారీగా మద్దతు కూడా వచ్చింది. మరోవైపు విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పోస్టులు చేస్తున్నారంటూ పలు కారణాలతో పెద్దకొత్తపల్లి ఠాణాలో కేసు కూడా నమోదయ్యింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తూ గుర్తింపు పొందారు శిరీష.

కొల్లాపూర్ బరిలో…

ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల గళం వినిపించే ప్రయత్నం చేశారు బర్రెలక్క. నామినేషన్‌ వేసి…. చివరకు వరకు నిలిచారు. కేవలం తల్లితో కూడా నామినేషన్ వేసిన ఆమెకు…ఆ తర్వాత పెద్ద ఎత్తున మద్దతు లభించింది. విద్యార్థి, ప్రజాసంఘాలతో పాటు… పలువురు మేథావులు కూడా శిరీషకు మద్దతుగా నిలిచారు. ఆమె తరపున ప్రచారం చేసి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక విజల్ గుర్తపై పోటీ చేసిన శిరీషకు… 5,754 ఓట్లు రాగా నాలుగో స్థానంలో నిలిచారు.

బర్రెలక్క ఎన్నికలలో విజయం సాధించకపోయినా కనీసం 15 వేలు నుంచి 20 వేల ఓట్లు వ‌స్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఈ అంచనాలు తారుమారయ్యాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన బర్రెలక్కకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ప్రచారంలో దూసుకుపోయిన బర్రెలక్కకు కొల్లాపూర్ ప్రజలు అంతతా మద్దతు తెలపలేదు. ఈసారి బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిస్తే చరిత్ర సృష్టిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ప్రచారం మోత మోగించినా, అది ఓటు బ్యాంకుగా మారలేదని పలువురు అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన బర్రెలక్క… బాధపడుతున్నట్లు చెప్పారు. కానీ తాను ఇక్కడి వరకు రావటం చాలా గొప్ప అని వ్యాఖ్యానించారు. ఈ బాధలో నుంచి త్వరలోనే బయటికి వస్తానని ఓ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి… తక్కువ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క అలియాస్…ఈసారి పార్లమెంట్ బరిలో ఉంటానంటూ ప్రకటన చేయటం ఆసక్తికరంగా మారింది.