Canara Bank Appraiser: బ్యాంకులో బంగారం మాయం, ములుగు జిల్లాలో రెండు కిలోల బంగారం కొట్టేసిన అప్రైజర్-bank lost gold appraiser stolen two kg of gold in mulugu district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Canara Bank Appraiser: బ్యాంకులో బంగారం మాయం, ములుగు జిల్లాలో రెండు కిలోల బంగారం కొట్టేసిన అప్రైజర్

Canara Bank Appraiser: బ్యాంకులో బంగారం మాయం, ములుగు జిల్లాలో రెండు కిలోల బంగారం కొట్టేసిన అప్రైజర్

HT Telugu Desk HT Telugu
May 27, 2024 09:28 AM IST

Canara Bank Appraiser: ములుగు జిల్లాలో ఓ ఘరానా మోసం బయట పడింది. వివిధ అవసరాల నిమిత్తం బ్యాంకులో జనాలు తాకట్టు పెట్టిన బంగారం కనిపించకుండా పోయింది. దాదాపు రూ.కోటిన్నర విలువైన గోల్డ్ మాయం కాగా, ఇటీవల నిర్వహించిన వార్షిక ఆడిట్ లో విషయం బయటపడింది.

కెనరా బ్యాంకులో బంగారానికి రెక్కలు
కెనరా బ్యాంకులో బంగారానికి రెక్కలు

Canara Bank Appraiser: బ్యాంక్ అప్రైజర్‌ బంగారాన్ని కాజేసిన ఘటన ములుగు జిల్లాలో వెలుగు చూసింది. బ్యాంక్ ఆడిట్‌లో రెండు కిలోల బంగారం మాయం కావడాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

yearly horoscope entry point

ములుగు జిల్లా మంగపేట మండలంలోని రాజుపేట కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో బంగారం రుణాల్లో మోసాలను గుర్తించారు. బ్యాంక్ పరిధిలోని గ్రామాలకు సంబంధించిన రైతులు, వ్యాపారులు తమ తమ వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార, వ్యక్తిగత అవసరాల నిమిత్తం బ్యాంకులో తమ బంగారం తనాఖా పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. ఇలా బ్యాంకులో వివిధ వ్యక్తుల నుంచి రెండు కిలోలకు పైగా బంగారం బ్యాంకులో పోగైంది.

గుట్టుచప్పుడు కాకుండా గల్లంతు..

నర్సంపేట నుంచి మంగపేట మండలంలోని పాలాయి గూడెంకు వలస వచ్చిన సమ్మెట ప్రశాంత్ అనే వ్యక్తి కెనరా బ్యాంక్ లో అప్రైజర్ గా పని చేస్తూ వచ్చాడు. ఆయన ద్వారా చాలామంది బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు.

ఇటీవల కెనరా బ్యాంక్ రాజుపేట బ్రాంచ్ లో వార్షిక ఆడిట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఖాతాదారులు గత ఏడాది కాలంలో తాకట్టు పెట్టిన బంగారం లెక్కలను కూడా సంబంధిత అధికారులు తీశారు. ఆడిట్ లెక్కలు చూస్తున్న అధికారులు అందులో ఉన్న రికార్డ్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

బ్యాంకులో ఉన్న తాకట్టు లెక్కలకు, నిల్వలకు ఏమాత్రం పొంతన లేదు. దీంతో ఒకటికి రెండు సార్లు లెక్కలేసిన అధికారులు బంగారం గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. వెంటనే విషయాన్ని బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.

కంగారు పడిన మేనేజర్ వెంటనే బ్యాంక్ అప్రైజర్ సమ్మెట ప్రశాంత్ ను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ప్రశాంత్ ఆ గ్రామం నుంచి భార్య, పిల్లలతో కలిసి ఉడాయించినట్లు గుర్తించారు. దీంతో బ్యాంక్ అప్రైజర్ ప్రశాంతే చాకచక్యంగా బంగారాన్ని కొట్టేసినట్లు నిర్ధారణకు వచ్చారు.

రెండు కిలోలు.. 1.44 కోట్లు

బ్యాంకు నుంచి మాయమైన బంగారం దాదాపు 2 కిలోల 117 గ్రాముల వరకు ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. దాని విలువ సుమారు రూ.1.44 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు మంగపేట పోలీస్ స్టేషన్ లో అప్రైజర్ ప్రశాంత్ పై బ్యాంక్ వరంగల్ రీజినల్ అసిస్టెంట్ మేనేజర్ పేరున ఫిర్యాదు చేశారు. బ్యాంకు రుణాలు మంజూరు చేసే సమయంలో అదనపు బంగారం లెక్కల్లో చూపించి మోసాలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్రపై విచారణ జరుపుతున్నారు. అప్రైజర్‌తో కుమ్మక్కై మోసాలకు పాాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దీంతో ఎస్సై రవి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అప్రైజర్ ఏడాదిన్నర కాలంగా నర్సంపేట నుంచి వలస వచ్చి పాలాయిగూడెంలో ఓ ఇల్లు కొనుగోలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రాజుపేటలో గోల్డ్ షాప్ నిర్వహిస్తూ చుట్టు ప్రక్కల గ్రామస్తులందరిని మచ్చిక చేసుకొని కొందరి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో అప్పులు కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అప్పుగా తీసుకున్న నగదుతో పాటు బ్యాంక్ బంగారం తో ఆయన పరారు కాగా స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విషయం కాస్త బయటకు పొక్కడంతో ఖాతాదారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner