Bandi Sanjay: రేపటి నుంచి కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణలో బండి సంజయ్ పర్యటనలు-bandi sanjay visits telangana as union minister from tomorrow ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: రేపటి నుంచి కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణలో బండి సంజయ్ పర్యటనలు

Bandi Sanjay: రేపటి నుంచి కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణలో బండి సంజయ్ పర్యటనలు

HT Telugu Desk HT Telugu
Jun 18, 2024 05:59 AM IST

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ బుధవారం నుంచి తెలంగాణలో పర్యటించనున్నారు.

బండి సంజయ్ పర్యటన
బండి సంజయ్ పర్యటన

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బండి సంజయ్ కుమార్ తొలిసారి తెలంగాణలో పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది.

ఈనెల 19 నుంచి 23 వరకు కరీంనగర్, హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమర్ కు ఘన స్వాగతం పలికేందుకు కమలనాథులు సిద్దమయ్యారు. వాస్తవానికి 19న ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కలిసి రాష్ట్రానికి రావాలని భావించారు.

అయితే 19న సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీకి హాజరు కావాలని కిషన్ రెడ్డికి సమాచారం రావడంతో తన పర్యటనను మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఈనెల 24 నుండి పార్లమెంట్ సమావేశాలున్న నేపథ్యంలో తగిన సమయం లేనందున కరీంనగర్ వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనాలని...కిషన్ రెడ్డి సలహా ఇవ్వడంతో బండి సంజయ్ ఈనెల 19 నుంచి 22 వరకు కరీంనగర్ లో పర్యటించనున్నారు.

బండి ఫస్ట్ టూర్ గుళ్ళు గోపురాలు, పార్టీ శ్రేణులతో భేటీలు..

తొలిరోజు 19న ఉదయం 9 గంటలకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని శనిగరం వద్దకు చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం వారితో కలిసి కరీంనగర్ చేరుకుని నేరుగా మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం చైతన్యపురిలోని తన నివాసానికి వెళ్లి మాతృమూర్తి ఆశీస్సులు తీసుకుంటారు.

అక్కడి నుండి నేరుగా కొండగట్టు బయలుదేరి వెళతారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తనను కలిసేందుకు వచ్చిన చొప్పదండి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో గడుపుతారు. అనంతరం నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు . అదే రోజు సాయంత్రం 4 గంటలకు వేములవాడ శ్రీరాజశ్రీరాజేశ్వర ఆలయానికి విచ్చేస్తారు.

ఎములాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కలిసి ముచ్చటిస్తారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు సిరిసిల్ల నియోజక కేంద్రానికి వెళతారు. పట్టణంలోని మార్కండేయ దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించడంతోపాటు తనను కలిసేందుకు వచ్చిన సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటారు. ఆ తరువాత నేరుగా కరీంనగర్ కు చేరుకుంటారు.

మరుసటి రోజు 20న మధ్యాహ్నం వరకు కరీంనగర్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం హైదరాబాద్ వెళ్లి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

23న ఢిల్లీ కీ.…

ఈనెల 21న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రసిద్ది చెందిన దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. తిరిగి రాత్రి కరీంనగర్ చేరుకుంటారు.

అనంతరం ఈనెల 22న కరీంనగర్ పట్టణంలోని శివాలయం, రామేశ్వరాలయం, భగత్ నగర్ అయ్యప్ప ఆలయాలను సందర్శించడంతోపాటు స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈనెల 24 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 23న ఢిల్లీ పయనమమవుతారు.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

WhatsApp channel