Bandi Sanjay : గవర్నర్ వ్యవస్థపై కేసీఆర్ కుట్ర చేస్తున్నారు... బండి సంజయ్-bandi sanjay slams kcr and telangana government over differences with governor ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bandi Sanjay Slams Kcr And Telangana Government Over Differences With Governor

Bandi Sanjay : గవర్నర్ వ్యవస్థపై కేసీఆర్ కుట్ర చేస్తున్నారు... బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Mar 03, 2023 05:32 AM IST

Bandi Sanjay : రాష్ట్ర గవర్నర్ ను సీఎం కేసీఆర్ పదే పదే అవమానిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పెండింగ్ బిల్లుల అంశంలో గవర్నర్ పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లడాన్ని తప్పుపట్టిన ఆయన... తల తిక్క నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందుల పాలుజేస్తున్న కేసీఆర్ పై ఎన్ని దావాలు వేయాలని నిలదీశారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay : రాష్ట్ర ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ తమిళి సై సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడంపై... రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు... వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మహిళా గవర్నర్ ను అవమానించడమే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదంటూ సుప్రీంకోర్టుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కేసీఆర్ పై సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు వేయాలి ? అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఝూఠా మాటలతో, తల తిక్క నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందుల పాల్జేయడమే కాకుండా.... 50 వేల జీవోలను వెబ్ సైట్ లో పెట్టకుండా సమాచార హక్కు చట్టం స్పూర్తినే దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రిపై ఎన్ని దావాలు వేయాలని నిలదీశారు.

ట్రెండింగ్ వార్తలు

2014 నుంచి మొన్నటి వరకు బీఆర్ఎస్ పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూ హైకోర్టు ఎన్నిసార్లు మెట్టికాయలు వేసిందో కేసీఆర్ గుర్తు తెచ్చుకోవాలన్నారు బండి సంజయ్. సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అనేక మంది అధికారులపై వేల కొద్ది కోర్టు ధిక్కరణ కేసులున్నాయని అన్నారు. గవర్నర్ పై ప్రభత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో సమన్వయంగా వ్యవహరిస్తున్నట్లు నటించిన కేసీఆర్ ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కి గవర్నర్ వ్యవస్థను అప్రదిష్టపాల్జేయడమే లక్ష్యంగా చర్చలోకి లాగేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి మొదటి నుంచి మహిళలంటేనే అలుసని... తొలి కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదని... మహిళా కమిషన్ ను నియమించలేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ది... మహిళలు వంటింటికే పరిమితం కావాలనే సంకుచిత మనస్తత్వమన్నారు.

గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు వంగి వంగి పాదాభివందనాలు చేసిన కేసీఆర్ ఉన్నత విద్యావంతురాలైన తమిళిసై మహిళ గవర్నర్ గా వచ్చినప్పటి నుంచి జీర్ణించుకోలేకపోతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఆమెకు కనీస మర్యాద ఇవ్వాలనే సోయి లేకుండా అవమానించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. 80 వేల పుస్తకాలు చదివినట్లు చెప్పుకునే కేసీఆర్ కు రాష్ట్ర ప్రథమ పౌరురాలిపట్ల ఎలా వ్యవహరించాలో కూడా తెలియకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

"అసలు గవర్నర్ చేసిన తప్పేమిటి ? క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తే ఆ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడమే నేరమా ? ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజలను కలవకుండా, ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఫాంహౌజ్, ప్రగతి భవన్ కే పరిమితమైతే గవర్నర్ గా ప్రజలను కలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ఆమె చేసిన తప్పా ? కనీస సౌకర్యాల్లేక కునారిల్లుతున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు, వైద్య రంగానికి కాయకల్ప చికిత్స చేసేందుకు తనవంతు ప్రయత్నం చేయడం తప్పా ? ముఖ్యమంత్రిగా నిర్వర్తించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ రాక్షస పాలన కొనసాగిస్తుంటే.... ప్రజా సమస్యల పరిష్కారానికి యత్నిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడుతున్న గవర్నర్ తమిళిసై అంటే కేసీఆర్ కు కడుపు మంట.

పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం నాడు నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రోటోకాల్ ను కూడా పాటించకుండా గవర్నర్ ను పదేపదే అవమానపరుస్తున్నారు. జిల్లా పర్యటనలకు వెళితే కనీసం కలెక్టర్ స్థాయి అధికారులను పంపించకుండా అవమానించారు. గవర్నర్ సమన్వయంతో వ్యవహరించాల్సిన మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ రాజ్యాంగ వ్యవస్థను కించపర్చడం ఎంతవరకు సమంజసం ?" అని బండి సంజయ్ నిలదీశారు.

గవర్నర్ వ్యవస్థపట్ల కేసీఆర్ సంకుచిత ధోరణిని, అహంకారపూరిత విధానాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.. బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గతంలో ఇదే విషయంపై హైకోర్టుకు వెళితే ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ అత్యున్నత న్యాయ స్థానంలోనూ కేసీఆర్ కు మరోసారి చుక్కెదురు కావడం ఖాయమని చెప్పారు. ముఖ్యమంత్రి వింత చేష్టలు, విచిత్ర నిర్ణయాలు, రాక్షస విధానాలను రాష్ట్రమంతా గమనిస్తోందని... ప్రజా కోర్టులోనూ నీకు శిక్ష పడటం తథ్యమన్నారు.

WhatsApp channel