Karimnagar : రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాలన భ్రష్టు పట్టింది : బండి సంజయ్-bandi sanjay slams chief minister revanth reddy in karimnagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar : రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాలన భ్రష్టు పట్టింది : బండి సంజయ్

Karimnagar : రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాలన భ్రష్టు పట్టింది : బండి సంజయ్

HT Telugu Desk HT Telugu

Karimnagar : తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. సచివాలయంలో ఏఐసీసీ ఇంఛార్జ్ రివ్యూ చేయడం ఏంటని ప్రశ్నించారు. అవినీతి కాంగ్రెస్ పాలనను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

మీడియాతో మాట్లాడుతున్న బండి సంజయ్

కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్‌లా మారారని సెటైర్లు పేల్చారు. సచివాలయం నుంచి ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో రివ్యూ చేయడమేందని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏఐసీసీ అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ తొలుత తన నివాసంలో, ఆ తరువాత కరీంనగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు.

రబ్బర్ స్టాంప్‌లా..

'తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టింది. 6 గ్యారంటీలకు దిక్కులేకుండా పోయింది. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్‌లా మారారు. జన్ పథ్, గాంధీభవన్ ద్వారా పాలనను కొనసాగిస్తున్నారు. మంత్రివర్గంలో ఎవరుండాలనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందనడం విడ్డూరం. మంత్రివర్గ విస్తరణ సీఎం విచక్షణాధికారం. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గు చేటు. తెలంగాణను దోచుకుని ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారు. పాలనపై సీఎంకు పట్టులేకుండా పోయింది.హెచ్‌సీయూ భూముల వ్యవహారమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అవినీతి పాలనను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది' అని సంజయ్ వ్యాఖ్యానించారు.

మజ్లిస్ కోసం..

'హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై మజ్లిస్‌ను గెలిపించాలనుకుంటన్నాయి. హైదరాబాద్‌ను మజ్లిస్‌కు అప్పగించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడుతున్నాయి. దేశ ద్రోహ పార్టీ మజ్లిస్...దేశభక్తి పార్టీ బీజేపీ. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశద్రోహ పార్టీకి, దేశభక్తి పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలివి. ఎవరి పక్షాన నిలబడి ఓటేస్తారో.. హైదరాబాద్ కార్పొరేటర్లు, ఓటర్లు ఆలోచించాలి. సిద్ధాంతం కోసం పనిచేసే బీజేపీ అభ్యర్థి గౌతంరావు గెలుస్తారనే నమ్మకం ఉంది. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నడో కుమ్కక్కైనయ్. చెన్నైలో డీలిమిటేషన్ మీటింగ్‌కు రెండు పార్టీలు కలిసే హాజరయ్యాయి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రెండు పార్టీలు కలిసే ఓటేశాయి' అని బండి ఫైర్ అయ్యారు.

సిద్ధాంత బలంతో..

'దేశ ప్రజలకు, కార్యకర్తలందరికీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొడుకులు, అవమానాలను అధిగమించిన పార్టీ బీజేపీ. వేలాది మంది కార్యకర్తల బలిదానాలు, లక్షలాది మంది పోరాటాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ. జాతీయ భావజాలం, సిద్ధాంత బలమే బీజేపీ ఈ స్థాయికి చేరింది. 2019లోనే బీజేపీ 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే నెంబర్ వన్ పార్టీగా అవతరించింది. 16 రాష్ట్రాల్లో సొంతంగా, 6 రాష్ట్రాల్లో కూటమి ద్వారా ప్రభుత్వాలను కొనసాగిస్తున్నం' అని సంజయ్ వివరించారు.

ప్రగతికి బాటలు..

'వాజ్ పేయి ఆధ్వర్యంలో ప్రోక్రాన్ అణుపరీక్షలతో దేశ సత్తా చాటినం. స్వర్ణ చతుర్భుజీ పేరుతో జాతీయ రహదారులను విస్తరించిన ఘనత బీజేపీదే. చిట్టచివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలన్న దీన్ దయాళ్ ఆశయాలను కొనసాగిస్తున్నాం. మోదీ పాలనలో భారత్ ఆర్ధిక ప్రగతిలో అద్బుత ఫలితాలను కనబరుస్తోంది. అభివృద్ధి, సంక్షేమంలో దేశం దూసుకుపోతోంది. కేంద్ర సంక్షేమ పథకాలను పూర్తిగా తెలంగాణలో అమలు చేయడం లేదు. అన్ని రాష్ట్రాలను సమాన థృక్పథంతో చూస్తూ అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మోదీదే' అని బండి స్పష్టం చేశారు.

సన్న బియ్యం మోదీ ఇచ్చేవే..

'రేషన్ షాపుల వద్ద ప్రజలకు ఇచ్చేది మోదీ బియ్యమే. కిలోకు రూ.37 ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మోదీదే. సన్న బియ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భరించేది రూ.10. అట్లాంటప్పుడు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫొటో ఎందుకు పెట్టకూడదు? 10 రూపాయలకు కిలో సన్నబియ్యం ఎక్కడైనా వస్తాయా? ఆ విషయాన్ని తెలుసుకుని మంత్రులు, కాంగ్రెస్ నేతలు మాట్లాడితే మంచిది. బీజేపీ కార్యకర్తలారా.. గ్రామగ్రామాన తిరిగి ప్రజలకు రేషన్ బియ్యంపై వాస్తవాలు వివరించండి. వడ్ల కొనుగోలు నుండి బియ్యం దాకా ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోంది' అని కేంద్రమంత్రి వివరించారు.

(రిపోర్టింగ్- కె.వి.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం