Delimitation Politics : లిక్కర్ దొంగలంతా ఒకేచోట జమై.. దక్షిణాది పేరుతో డ్రామాలాడుతున్నరు: బండి సంజయ్-bandi sanjay sensational comments about the delimitation conference held in chennai ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Delimitation Politics : లిక్కర్ దొంగలంతా ఒకేచోట జమై.. దక్షిణాది పేరుతో డ్రామాలాడుతున్నరు: బండి సంజయ్

Delimitation Politics : లిక్కర్ దొంగలంతా ఒకేచోట జమై.. దక్షిణాది పేరుతో డ్రామాలాడుతున్నరు: బండి సంజయ్

Delimitation Politics : కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, ఆప్, సీపీఎం పార్టీలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై.. డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇన్ని సమస్యలుంటే.. సీఎం రేవంత్ రెడ్డి చెన్నై ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

కరీంనగర్‌లో మాట్లాడుతున్న బండి సంజయ్

స్టాలిన్ ప్రభుత్వం వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసిందని.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళలోనూ లిక్కర్ స్కాం బయటపడిందని.. ఆప్, బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ లిక్కర్ స్కాం చేసి జైలుకు పోయాలని విమర్శించారు. వీళ్లంతా కలిసి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతూ.. మోదీ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ జీడీపీకి, పార్లమెంట్‌లో ప్రాతినిధ్యానికి లింకు పెట్టడంపై మండిపడ్డారు.

ఇదేం విచిత్రం?..

'చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లిక్కర్ దొంగల ముఠా ఒకే చోట సమావేశమై విచిత్రమైన తీర్మానం చేశారు. దేశ జీడీపీలో దక్షిణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్‌లో కూడా దక్షిణాదికి 36 శాతందాకా వాటా ఇవ్వాలని అడుగుతున్నరు. ఇదేం విచిత్రం? దేశ జీడీపీకి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యానికి సంబంధమేంది? అట్లనుకుంటే తెలంగాణ జీడీపీలో వెనుకబడ్డ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అంత మాత్రాన అసెంబ్లీలో వాటికి ప్రాతినిధ్యం ఉండకూడదా? ఇదెక్కడికి దిక్కుమాలిన ప్రతిపాదన? దక్షిణాది పేరుతో రాజకీయాలు చేస్తూ డీలిమిటేషన్‌ను అడ్డుకునే కుట్రలు చేయడమేంది?' అని సంజయ్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ మోసం చేస్తోంది..

'పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబ పాలనతో సర్వ నాశనమైంది. బీదర్‌లో ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో దొంగ నోట్లు ముద్రిస్తారు. అది బీఆర్ఎస్ నేతది. ఆ ప్రింటింగ్ ప్రెస్‌ను మూసివేసేందుకు రాష్ట్ర పోలీసులు వెళితే.. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఫోన్ చేసి అక్కడికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. గత ఎన్నికల్లో పంచిన నోట్లన్నీ దొంగ నోట్లే. బీఆర్ఎస్ పాలన పీడ విరగడ కావాలని ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే ఏం ఒరిగింది? 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు. కానీ ఏమైంది? 15 నెలలుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా వంచిస్తూనే ఉంది. విద్యాశాఖకు అసలు మంత్రి కూడా లేదు. ఆయనే ఆ శాఖ మంత్రిగా ఉన్నా.. టీచర్లకు ఒరిగిందేమీ లేదు' అని బండి విమర్శించారు.

జనం అల్లాడుతున్నరు..

'ఒకవైపు రాష్ట్రంలో జనం అల్లాడుతున్నరు. సాగు నీరందక రైతులు 10 లక్షలకుపైగా పంట నష్టపోయిర్రు. నిన్న, మొన్న కురిసిన అకాల వర్షాలతో మళ్లీ పంట దెబ్బతిన్నది. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో లక్షలాది మంది పేద రోగులు ట్రీట్‌మెంట్‌కు నోచుకోవడం లేదు. పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో.. లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమైతున్నరు' అని సంజయ్ వ్యాఖ్యానించారు.

పెన్షనర్ల కన్నీళ్లు..

'పెండింగ్ బిల్స్ చెల్లించకపోవడంతో వేలాది మంది మాజీ సర్పంచులు అప్పులపాలై బజారునపడ్డరు. చాలీచాలని వేతనాలతో అంగన్ వాడీలు, ఆశావర్కర్లు రోడ్లపై ధర్నా చేస్తూ ఆర్తనాదాలు చేస్తున్నరు. ఉద్యోగాలు రాక లక్షల మంది నిరుద్యోగులు అరిగోస పడుతున్నరు. పీఆర్సీ అమలు కాక, 5 డీఏలు అందక, దాచుకున్న జీపీఎఫ్ పైసలందక లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు బాధపడుతున్నరు. రిటైర్డ్‌మెంట్ బకాయిలు చెల్లించక, పెన్షనర్ల సమస్యను పరిష్కరించకపోవడంతో.. మాకెందుకీ గోస అంటూ పెన్షనర్లు కన్నీళ్లు కారుస్తున్నరు' అని బండి ఆవేదన వ్యక్తం చేశారు.

డీలిమిటేషన్ పేరుతో రాజకీయాలా..

'రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే ఇవేమీ పట్టని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చెట్టాపట్టాలేసుకుని.. చెన్నై పోయి డీలిమిటేషన్ పేరుతో రాజకీయాలు చేస్తారా?. మోదీ ప్రభుత్వంపై విషం కక్కడం తప్ప ప్రజలుకు ఈరెండు పార్టీలు చేస్తున్నదేమిటి?. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు' అని సంజయ్ స్పష్టం చేశారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.