Bandi Sanjay : రేవంత్‌ రెడ్డిని దించేయాలని కాంగ్రెస్‌ మంత్రులు కుట్ర చేస్తున్నారు : బండి సంజయ్-bandi sanjay sensational allegations against congress ministers about the post of cm ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay : రేవంత్‌ రెడ్డిని దించేయాలని కాంగ్రెస్‌ మంత్రులు కుట్ర చేస్తున్నారు : బండి సంజయ్

Bandi Sanjay : రేవంత్‌ రెడ్డిని దించేయాలని కాంగ్రెస్‌ మంత్రులు కుట్ర చేస్తున్నారు : బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Oct 19, 2024 09:36 AM IST

Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడిన సంజయ్.. సీఎం సీటు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని దించడానికి కాంగ్రెస్ మంత్రులే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలపైనా ఘాటుగా స్పందించారు.

బండి సంజయ్
బండి సంజయ్

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆ పదవి నుంచి దించేయాలని కాంగ్రెస్‌ మంత్రులే కుట్రలు చేస్తున్నారని.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తగిన సమయం కోసం కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మూసీ, హైడ్రా, గ్రూప్‌ 1 విషయాల్లో రేవంత్ రెడ్డి జాగ్రత్తపడకపోతే చిక్కులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

మూసీ, గ్రూప్‌ 1, హైడ్రా బాధితుల ఆందోళనలతో రేవంత్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న బండి.. ఆ వ్యతిరేకత ఇంకా పెరగాలని మంత్రులు భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేలా పావులు కదుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్‌ 1 అభ్యర్థుల ఆందోళనతో కాంగ్రెస్‌ ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు.

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను రీ షెడ్యూల్‌ చేయాలని, మొండిగా వ్యవహరించవద్దని బండి సంజయ్ సూచించారు. గ్రూప్‌ 1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళా అభ్యర్థులను అర్ధరాత్రి అరెస్టు చేయడం ఏంటని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్‌నగర్‌ వెళ్లి గ్రూప్‌ 1 అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతానని స్పష్టం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవో 29ని తీసుకువచ్చిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చేసిన తప్పును సరిదిద్దుకోకుండా.. కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణను మొహబ్బత్‌ కి దుకాన్‌ చేస్తానని.. రాహుల్‌ గాంధీ ఎన్నికలప్పుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

కానీ.. ఇప్పుడు తెలంగాణ నఫ్రత్‌ కా బజార్‌‌గా మారిందని సంజయ్‌ ఆరోపించారు. నిరుద్యోగులకు బ్రాండ్‌ అంబాసిడర్‌లాగా కేటీఆర్‌ ఫోజులు కొడుతున్నారని, బీఆర్‌ఎ్‌సకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హతే లేదని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మూసీ సుందరీకరణపై రేవంత్‌ రోజుకో మాట మాట్లాడుతున్నారని బండి సంజయ్‌ విమర్శించారు.

మూసీ నది సుందరీకరణ కోసం లక్షన్నర కోట్లు ఖర్చుచేస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని సంజయ్ గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళనకు ప్రపంచ బ్యాంకు అప్పుకోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగిల పడుతోందని వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణ పేరుతో భారీ దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని.. దీనికి బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీపై కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు.

(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner