Bandi Sanjay: బోనస్ తప్పించుకోవడానికే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారన్న బండి సంజయ్-bandi sanjay said that they congress delaying the purchase of grain to avoid bonus ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: బోనస్ తప్పించుకోవడానికే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారన్న బండి సంజయ్

Bandi Sanjay: బోనస్ తప్పించుకోవడానికే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారన్న బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Nov 11, 2024 06:39 AM IST

Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి వడ్ల కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బ్రోకర్ల నుండి కమీషన్లు దండుకునేందుకు రాష్ట్ర రైతుల ప్రయోజనాలను బలి పెడుతున్నారని ధ్వజమెత్తారు.

ధాన్యం పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
ధాన్యం పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణలో రైతులకు బోనస్‌ చెల్లించకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  వడ్ల పైసలన్నీ మిత్తీతో సహా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. అయినప్పటికీ వడ్లు కొనివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన మిత్తీతో సహా నొప్పి ఏందని ప్రశ్నించారు.కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు లో ధాన్యం కొనుగోళ్ళను కేంద్రమంత్రి బండి సంజయ్ పరిశీలించారు.

వడ్ల కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ‘నేషనల్ హైవేపైన వడ్లు పోశారు? ఎన్నాళ్లయింది? వడ్లు కొంటున్నారా? బోనస్ ఇచ్చారా? కనీస మద్దతు ధర ఇస్తున్నారా? తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొంటున్నారా?’’అని అడిగారు. నెలరోజులైనా వడ్లు కొనడం లేదని, అడ్డికి పావుశేరు బ్రోకర్లకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

వరికోసి నెలరోజులు అవుతున్నా ఇంకా కొనుగోలు కాలేదని...ప్రతి ఏటా నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. రైతుల సమస్యలను విన్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. మిత్తీతో సహా వడ్ల పైసలన్నీ కేంద్రమే ఇస్తోందని తెలిపారు. సుతిలి తాడుసహా రవాణా ఖర్చులన్నీ కేంద్రం భరిస్తోందని ఇలాంటి పరిస్థితుల్లో వడ్ల కొనడానికి మీకున్న నొప్పేందని ప్రశ్నించారు.

 వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్ కు, ఆచరణకు పొంతనే లేదన్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా నేటికీ పూర్తిగా ప్రారంభించలేదని పేర్కొంటూ సర్కార్ గణాంకాలతోసహా వివరిస్తూ కాంగ్రెస్ ను తూర్పారపట్టారు.

భారీ లక్ష్యం.. కొన్నది కొద్దిగా..

ఈ వానా కాలం సీజన్ లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత నెల అక్టోబర్ ఒకటో తేదీ నుండే వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. 7,572 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినం, అక్టోబర్ నెలలోనే 8 లక్షల మెట్రిక్ టన్నులు, నవంబర్ లో 33 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పారు. 

ఏ నెల ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనాలో కూడా యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. కానీ నవంబర్ 10 వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కూడా కొనుగోలు చేయలేదన్నారు. రైతులు ఇంత గోస పడుతుంటే ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేయలేదంటే ఏమనాలని ప్రశ్నించారు.‌ 

రాష్ట్రవ్యాప్తంగా 7,572 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పడు...6017 కేంద్రాలు మాత్రమే ఓపెన్ చేసిర్రు. ఇంకా 1724 కేంద్రాలు ఇంకా ఓపెనే చేయలే.. మరి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలన్నారు. గతేడాదితో పోలిస్తే కూడా ఈసారి చాలా తక్కువ వడ్లు కొన్నారని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నారని తెలిపారు. 

ఈసారి లక్ష మెట్రిక్ టన్నులు కూడా కొనలే. అందుకే నేను పదేపదే చెబుతున్న. రైతులు, తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయిందని... పోనీ వడ్లు రాలేదా? అంటే... ఇప్పటికే 30 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వడ్లు వచ్చినయ్. రైతులంతా నెలరోజులు కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు పోసి ఎదురు చూసిర్రు. రోడ్లపైన రాశులు పోసిర్రు.. అయినా ప్రభుత్వం వడ్లు కొనకుండా అరిగోస పెట్టడంతో విసిగిపోయిన రైతులు అడ్డికి పావుశేరుకు మిల్లర్లకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు

ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంపై బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారు?.. 6 గ్యారంటీలు అమలు చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500 లు ఇచ్చారని విజయోత్సవాలు చేసుకుంటారా? వృద్దులకు రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇచ్చారని చేసుకుంటారా? పేదలకు ఇండ్లు ఇచ్చారని చేసుకుంటారా? దేనికోసం విజయోత్సవాలు...నమ్మించి ఓట్లేయించుకుని మోసం చేసినందుకు ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి.’’అంటూ దుయ్యబట్టారు.

ఆలయాల ధ్వంసంపై.…

రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు బండి సంజయ్. మొన్ననే శంషాబాద్ హనుమాన్ ఆలయంలో నవగ్రహాలను ధ్వంసం చేశారు. ఆ ఘటన మరవక ముందే శంషాబాద్ లోనే మళ్లీ గుడిని సల్మాన్ అనేటోడు దాడి చేసిండు. వరుస ఘటనలను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలయాలను ధ్వంసం చేసేందుకు ప్రత్యేక దళాలు ఏమైనా వచ్చాయా? అనే అనుమానం కలుగుతుందన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూసీ చూడనట్లు పోతోంది కాబట్టి ఏం చేసినా పట్టించుకోరని దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. ఇది కరెక్ట్ కాదు... వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner