Bandi Sanjay Comments : సంతోష్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు-bandi sanjay respond on look out notices issued to bl santhosh
Telugu News  /  Telangana  /  Bandi Sanjay Respond On Look Out Notices Issued To Bl Santhosh
బండి సంజయ్
బండి సంజయ్

Bandi Sanjay Comments : సంతోష్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు

22 November 2022, 21:50 ISTHT Telugu Desk
22 November 2022, 21:50 IST

Bandi Sanjay On TRS : బీఎల్ సంతోషం ఏం తప్పు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. నోటీసుల పేరుతో అవమానిస్తే.. ఊరుకోం అని చెప్పారు. దేశం కోసం పనిచేస్తున్న గొప్ప వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు.

బీఎల్ సంతోష్(B.L Santhosh)కు నోటీసులు ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నోటీసుల పేరుతో ప్రచారక్‌ను అవమానిస్తే ఊరుకోమన్నారు. బీఎల్ సంతోష్‌కు ఫామ్‌హౌస్‌, బ్యాంకు అకౌంట్లు లేవని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర(Praja Sangrama Yatra)కు వస్తున్న ఆదరణ కేసీఆర్(KCR) చూడలేకపోతున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా యాత్రను పూర్తి చేస్తామన్నారు. శామీర్‌పేటలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో బండి సంజయ్ ఈ మేరకు వ్యాఖ్యాలు చేశారు.

తమ లాంటి కార్యకర్తలను తయారు చేసిన గొప్ప వ్యక్తి బీఎల్ సంతోష్ అని బండి సంజయ్(Bandi Sanjay) వ్యాఖ్యానించారు. దేశం కోసం పని చేస్తున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నోటీసుల పేరుతో ప్రచారక్‌ను అవమానిస్తే ఊరుకోమన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతమొందిస్తామన్నారు బండి సంజయ్.

'సీఎం కేసీఆర్(CM KCR) బీజేపీని అడ్డుకోలేక అప్రతిష్ఠపాలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి మీద చెప్పే దమ్ములేక కేసీఆర్ పదేపదే కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర(Praja Sangrama Yatra)ను కేసీఆర్ అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతాం. కేసీఆర్​కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాం. గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేస్తాం. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతమొందిస్తాం.' అని బండి సంజయ్ అన్నారు.

తెలంగాణ(Telangana) అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే.. పాదయాత్రలో పేర్కొన్నట్లుగా అర్హులందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. నిరుపేదలందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇస్తాం. అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటకు ఫసల్ బీమా యోజన కింద పరిహారం అందిస్తాం. కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను సీఎం కేసీఆర్(CM KCR) కాళ్ల దగ్గర పెట్టడం సిగ్గు చేటు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP)ని ఓడించేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు అన్నీ పార్టీలు టీఆర్ఎస్ తో కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు కేసీఆర్ సంకేతాలు పంపుతున్నారు. కేసీఆర్ కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారు. సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేసీఆర్ దుర్మార్గాలను గ్రహించిన కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేస్తూ... నిధులు దారి మళ్లకుండా చర్యలు తీసుకుంటుంటే దానిని కూడా టీఆర్ఎస్ తప్పుపడుతుంది.

- బండి సంజయ్

మరోవైపు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రజాగోస- బీజేపీ భరోసా యాత్ర జరగనుంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఒకటి లేదా రెండు అసెంబ్లీ(Assembly) నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు(Bike Rally) ఉంటాయి. మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూలు, జడ్చర్ల, షాద్‌నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, పరకాల, వర్దన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని యాత్ర ఇన్ఛార్జి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 200 బైక్‌లతో 10 నుంచి 15 రోజులపాటు బైక్ ర్యాలీలు ఉండనున్నాయి. ప్రతిగ్రామంలో సమావేశాలు నిర్వహించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది.

బండి సంజయ్‌ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర(Praja Sangrama Yatra) ఈ నెల 28 నుంచి డిసెంబర్‌ 15 లేదా 16 వరకు పాదయాత్ర సాగనుంది. బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి బైంసా నుంచి పాదయాత్ర మెుదలవుతుంది. కరీంనగర్‌(Karimnagar)లో ముగింపు సభను నిర్వహిస్తారు. ఇప్పటికే 4 విడతల్లో పాదయాత్ర చేశారు బండి సంజయ్. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల పరిధిలో 1,178 కి.మీల మేర నడిచారని బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది.