TG BC Politics : మీ అయ్య జాగీరా.. ముస్లింలను బీసీల్లో ఎట్లా చేరుస్తారు? బండి సంజయ్ ఫైర్!-bandi sanjay made sensational comments on including muslims in bcs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Bc Politics : మీ అయ్య జాగీరా.. ముస్లింలను బీసీల్లో ఎట్లా చేరుస్తారు? బండి సంజయ్ ఫైర్!

TG BC Politics : మీ అయ్య జాగీరా.. ముస్లింలను బీసీల్లో ఎట్లా చేరుస్తారు? బండి సంజయ్ ఫైర్!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 09, 2025 05:07 PM IST

TG BC Politics : ప్రస్తుతం తెలంగాణ రాజకీయం బీసీల చుట్టూ తిరుగుతోంది. ఇటీవల కుల గణన నివేదికను సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. ముస్లింలను బీసీల్లో చేర్చడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్
బండి సంజయ్

ఒవైసీ, రేవంత్ గ్యాంగ్ కలిసి బీసీలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయని.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలకు హాజరైన బండి.. బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. 'మీ అయ్య జాగీరా.. బీసీల్లో ముస్లింలను ఎట్లా చేరుస్తారు?' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

హిందువులు అడుక్కోవాలా?

'మేం బొట్టు పెట్టుకుంటాం.. మాకు జన్మ నక్షత్రముంది.. మొలదారం కట్టుకుంటాం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు వత్తాసు పలుకుతారా? ఇట్లయితే గ్రామాల్లోనూ బీసీ స్థానాల్లో ముస్లింలు పోటీ చేస్తారా? హిందువులు అడుక్కోవాలా? బిచ్చమెత్తుకోవాలా? జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనే ఈ కుట్రను అడ్డుకోకపోవడంవల్లే ఈ దుస్థితి వచ్చింది' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

నిరుద్యోగ భృతి ఏమైంది..

'నిరుద్యోగ భృతి 4 వేల రూపాయలిస్తామన్నారు. 14 నెలలైంది. ఈ లెక్కన ప్రతి నిరుద్యోగికి కాంగ్రెస్ 56 వేల రూపాయలు బాకీ పడింది. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి 14 నెలల బకాయి ఇవ్వాలని నిలదీయండి. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కేవలం 25 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చి.. 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రచారం చేసుకున్నారు. మీ వద్దకు వచ్చే కాంగ్రెస్ నేతలను 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీయండి' అని సంజయ్ సూచించారు.

చాక్‌పీసులకు కూడా పైసల్లేవ్..

'కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. స్కూళ్లలో చాక్‌పీసులకు పైసల్లేవ్. విద్యాశాఖకు మంత్రి లేరు. అర్బన్ నక్సల్స్ చేతిలో విద్యా వ్యవస్థ బందీ అయ్యింది. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి? ఓట్ల కోసం మీ వద్దకు వస్తే.. హామీలేమయ్యాయని గల్లా పట్టి నీలదీయండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించండి. మీకోసం పోరాడుతున్న బీజేపీకి, మీ సంక్షేమం కోసం పనిచేస్తున్న మోదీకి మద్దతివ్వండి' అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

కేటీఆర్ డిమాండ్..

'రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని బీసీలను క్షమాపణ అడగాలి. కులగణన అంతా తప్పుల తడక అని మేము మాత్రమే కాదు.. బీసీలు అందరూ అంటున్నారు. కులగణన చిత్తు కాగితం అని సొంత పార్టీ ఎమ్మెల్సీ కాల్చేశాడు. కులగణనలో సంఖ్య తగ్గించి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. శాస్త్రీయంగా రీసర్వేకు ఆదేశించి.. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

Whats_app_banner