Bandi Sanjay : అసెంబ్లీ బరిలో బండి సంజయ్..! పోటీ చేసే సీటు ఇదేనా..?-bandi sanjay likely to contest from mudhole assembly constituency
Telugu News  /  Telangana  /  Bandi Sanjay Likely To Contest From Mudhole Assembly Constituency
ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్
ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ (twittter)

Bandi Sanjay : అసెంబ్లీ బరిలో బండి సంజయ్..! పోటీ చేసే సీటు ఇదేనా..?

14 December 2022, 6:15 ISTHT Telugu Desk
14 December 2022, 6:15 IST

Telangana BJP: 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు బండి సంజయ్. ఆ తర్వాత తెలంగాణ పార్టీ పగ్గాలను చేపట్టి దూసుకెళ్తున్నారు. అయితే ఈసారి పార్లమెంట్ కు కాకుండా... అసెంబ్లీకి వెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana Assembly Elections 2023: ఎన్నికల ఏడాది వచ్చేసింది...! రాజకీయపార్టీలు కూడా అలర్ట్ అయిపోతున్నాయ్..! హ్యాట్రిక్ కొట్టాలని టీఆర్ఎస్ చూస్తుంటే.. ఎలాగైనా తాము అధికారంలోకి రావాలని చూస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..! మరోవైపు నేతలు కూడా అప్పుడే టికెట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడే లైన్ క్లియర్ చేసుకుంటే బెటర్ అన్నట్లు పావులు కదిపే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే చాలా మంది ముఖ్య నేతలు కూడా... పొలిటికల్ ప్యూచర్ పై తెగ ఆలోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సంబంధించి పలు వార్తలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇందుకోసం ఓ సీటును ఖరారైందనే టాక్ వినిపిస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది తెలంగాణ బీజేపీ. కేవలం సింగిల్ సీటుతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బిగ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 4 సీట్లు గెలిచి... టీఆర్ఎస్ కు గట్టి సవాల్ విసిరింది. అనంతర పరిణామాలతో బలం పెంచుకుంటూ వస్తోంది. కీలకమైన దుబ్బాక, హుజురాబాద్ తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తాజాగా జరిగిన మునుగోడు పోరులోనూ సెకండ్ ప్లేస్ లో నిలిచి... కారు పార్టీకి గట్టి పోటీనిచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు గెలవాలని చూస్తోంది. ఇందుకోసం మిషన్ తెలంగాణ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ కూడా నడిపిస్తోంది. అయితే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే 4 దశలు పూర్తి చేశారు. అయితే ఈసారి ఆయన కూడా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అది కరీంనగర్ నుంచి కాకుండా... ముథోల్ నుంచి చేస్తారనే టాక్ జోరందుకుంది.

ఇక్కడ్నుంచే ఎందుకంటే..?

ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కూడా ముథోల్ నుంచే ప్రారంభం అయింది. ఆ సమయంలో బైంసా పేరును మారుస్తామని చెప్పారు సంజయ్. ముథోల్ ను దత్తత తీసుకుంటామని చెప్పుకొచ్చారు. గతంలో ఏ నియోజకవర్గంలో ఇలాంటి కామెంట్స్ చేయని బండి సంజయ్... ముథోల్ ను దత్తత తీసుకుంటామని చెప్పటంతో తాజా చర్చకు తెరలేపినట్లు అయింది. ఈ నేపథ్యంలో ఆయన ముథోల్ నుంచి పోటీ చేస్తారనే చర్చ మొదలైంది. దీని వెనక ఉన్న పలు కారణాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో బండి సంజయ్ సామాజికవర్గానికి చెందిన మున్నూరు కాపులు భారీగా ఉన్నారు. దాదాపు 45 వేలకుపైగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ హిందూత్వవాదం కూడా బలంగా వినిపిస్తూ ఉంటుంది.

ఈ స్థానం నుంచి పోటీ చేస్తే సామాజికవర్గ ఓట్లు భారీగా కలిసివచ్చే ఛాన్స్ ఉందన్న కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ చేస్తే ఈజీగా గెలవొచ్చనే అంచనాలు కూడా వేస్తున్నట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 40 వేలకు పైగా ఓట్లు సాధించింది. అయితే ఈ అంశంపై పార్టీ నాయకత్వం కూడా ఫోకస్ పెట్టినట్లు లీక్ లు వస్తున్నాయి. అన్నీ కుదిరితే బండి సంజయ్... ఇక్కడ్నుంచే బరిలో ఉంటారని స్పష్టమవుతోంది. అయితే ఈ విషయంలో బండి ఆలోచన ఎలా ఉందనేది చూడాలి. గత ఎన్నికల్లో గెలిపించిన కరీంనగర్ ప్రజలను కాదని... పక్క నియోజకవర్గానికి వస్తారా..? లేక అదే పార్లమెంట్ పరిధిలోని ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.