Bandi Sanjay On KCR: కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారంటున్న బండి సంజయ్-bandi sanjay kumar accused kcr of doing occult worship to win the election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay On Kcr: కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారంటున్న బండి సంజయ్

Bandi Sanjay On KCR: కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారంటున్న బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Sep 26, 2023 06:24 AM IST

Bandi Sanjay On KCR: తాంత్రిక పూజల్లో సిఎం కేసిఆర్ సిద్ధహస్తుడని బీజేపీ నాయకుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఇతర పార్టీల నేతలనే కాకుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కోరుకునే వ్యక్తి కేసిఆర్ అని, ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని బండి ఆరోపించారు.

బండి సంజయ్ కుమార్
బండి సంజయ్ కుమార్

Bandi Sanjay On KCR: ముఖ్యమంత్రి కెసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి సీఎం కేసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో మొక్కలు నాటి, ఎన్నికల ప్రచార రథం ప్రారంభించిన బండి.. కేసిఆర్ తాంత్రిక పూజల్లో కేసిఆర్ సిద్ధహస్తుడని ఆరోపించారు. ఇతర పార్టీల నేతలనే కాకుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కోరుకునే వ్యక్తి కేసిఆర్ అని అందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పారు. కేసిఆర్ నిమ్మకాయ ఇచ్చినా, బొట్టు పెట్టినా,కంకణం కట్టినా కట్టుకోవద్దని అయన BRS నేతలకు సూచించారు.

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి కేసిఆర్ 3 కోట్ల రూపాయలు గణేష్ మండపాల ఏర్పాటుకు విరాళాల క్రింద ఇచ్చి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.రానున్న ఎన్నికల్లో ఓట్లను దండుకునెందుకు కేసిఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో కేసిఆర్ ఒక్క ఓటుకు 3 వేల నుండి 10 వేల వరకు ఇచ్చారని ఆరోపించారు.గడిచిన పదేళ్లలో కేసిఆర్ కుంభకోణాలు, కుతంత్రాలు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

విద్యార్ధుల జీవితాలతో కేసిఆర్ చెలగాటం ఆడుతున్నారని, రాష్ట్రంలో పోటీ పరీక్షలే కాదు, టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా కేసిఆర్ సక్రమంగా నిర్వహించలేక పోతున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గుతుందని యువత తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,116 ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ మద్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలను మద్యానికి బానిసలుగా చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ కోవార్టులు ఉన్నారంటూ బండి సంజయ్ మరో బాంబ్ పేల్చారు.కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోసం పనిచేసేవారు చాలా మందే ఉన్నారని. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అంతా BRS లోకే వెళతారన్నారు. వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలే తమ పార్టీలో కోవర్టులు ఉన్నారని చాలా సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారని గుర్తుచేశారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్