Union Budget 2025 : బడ్జెట్ అద్బుతంగా ఉంది.. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలి : బండి సంజయ్
Union Budget 2025 : దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్ ఇది అని.. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని వివరించారు. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకమైన నిర్ణయం అని కొనియాడారు.
గత 75 ఏళ్లలో మునుపెన్నడూ లేని విధంగా మధ్య తరగతికి అనుకూలమైన బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని.. బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పత్తి, పప్పు దినుసులు పండించే రైతులకు లాభదాయకమైన బడ్జెట్ అని వివరించారు. ఇది సంక్షేమ బడ్జెట్, పేదల పెన్నిధి నరేంద్ర మోదీ అని కొనియాడారు. ప్రధాని మోదీ, ఆర్ధిక మంత్రికి ధన్యవాదాలు చెప్పారు. బడ్జెట్‌పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
అద్బుతంగా ఉంది..
'కేంద్ర బడ్జెట్ అద్బుతంగా ఉంది. పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ ఇది. మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరం. ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక చర్య. గత 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్ ఎన్నడూ రాలేదు' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ పేదల పక్షపాతి..
'ఇది సంస్కరణల బడ్జెట్. 2027నాటికి అమెరికా, చైనా తరువాత భారత్‌ను మూడో ఆర్ధిక వ్యవస్థగా అవతరింపజేసే దిశగానే ఈ బడ్జెట్‌ను రూపొందించడం గొప్ప విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఇంత గొప్ప బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన.. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిది' అని వివరించారు.
వీటి ధరలు తగ్గుతాయ్..
'తెలంగాణ సహా దేశంలో లక్ష రూపాయల లోపు జీతభత్యాలు పొందే ఉద్యోగులంతా ఇకపై పన్ను కట్టాల్సిన అవసరం లేకపోవడం గొప్ప విషయం. తద్వారా ఒక్కో ఉద్యోగికి సగటున రూ.80 వేలు ఆదా అయ్యే అవకాశముంది. పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే టీవీ, మొబైల్స్, లెదర్ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ధరలు కూడా తగ్గబోతున్నాయి. తద్వారా కాలుష్యం తగ్గే అవకాశముంది' అని సంజయ్ చెప్పారు.
అన్నదాతకు దన్నుగా..
'క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు వాడుతున్న ఔషధాలపై.. కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడం వల్ల.. ఆయా రోగాలకు చికిత్స వ్యయం చాలా వరకు తగ్గే అవకాశముంది. ఆర్ధిక వ్యవస్థను స్థిరంగా ఉంచడం తోపాటు వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలను బ్యాలెన్స్ చేసే బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ రైతులకు వరం. 7.7 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పేరిట రుణాలివ్వడమే లక్ష్యంగా పెట్టుకోవడం గొప్ప విషయం' అని కేంద్రమంత్రి కొనియాడారు.
రైతన్నలకు విజ్ఞప్తి..
'తెలంగాణలోని దాదాపు 50 లక్షల మంది రైతులకు.. రూ.5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా క్రెడిట్ (రుణం) లభించే అవకాశముంది. ప్రైవేట్ వ్యాపారస్తుల, దళారుల వద్ద చేయిచాపే దుస్థితి లేకుండా చేసేందుకు.. కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టారు. తక్షణమే తెలంగాణలోని రైతన్నలంతా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తు చేసుకుని లబ్ది పొందాలని కోరుతున్నా' అని సంజయ్ వ్యాఖ్యానించారు.