Bandi Sanjay: బండి సంజయ్‌కు కేంద్రంలో కీలక పదవి.. నాడు సాగర్‌ జీ, నేడు బండి సంజయ్-bandi sanjay has a key position at the centre sagarji then bandi sanjay today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: బండి సంజయ్‌కు కేంద్రంలో కీలక పదవి.. నాడు సాగర్‌ జీ, నేడు బండి సంజయ్

Bandi Sanjay: బండి సంజయ్‌కు కేంద్రంలో కీలక పదవి.. నాడు సాగర్‌ జీ, నేడు బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Jun 11, 2024 06:43 AM IST

Bandi Sanjay: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి వరించింది. జిల్లా నుంచి కీలకమైన పదవి పొందిన రెండో వ్యక్తిగా బండి సంజయ్ నిలిచారు. గతంలో విద్యాసాగర్‌ రావును ఈ పదవి వరించింది.

విద్యా సాగర్‌ రావుతో బండి సంజయ్
విద్యా సాగర్‌ రావుతో బండి సంజయ్

Bandi Sanjay: ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ కుమార్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి పదవి లభించింది. కరీంనగర్ నుంచి ఎంపీగా రెండో సారి గెలుపొందిన బండి సంజయ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన క్యాబినెట్ లో స్థానం కల్పించారు.

yearly horoscope entry point

కీలకమైన హోం శాఖ మంత్రి అమిత్ షా కు అండగా నిలిచేలా హోం శాఖ సహాయ మంత్రి పదవి కట్టబెట్టారు. హోం శాఖ సహాయ మంత్రి పదవి కరీంనగర్ నుంచి గెలిచిన వారికి దక్కడం ఇది రెండో సారి. కానీ, పాతికేళ్ళ తర్వాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి కరీంనగర్ కు దక్కింది.‌

1998, 1999 లో కరీంనగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన సిహెచ్ విద్యాసాగర్ రావు అప్పటి ప్రధానమంత్రి ఏబి వాజ్ పాయ్ క్యాబినెట్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఐదేళ్ళు ఆ పదవిలో విద్యాసాగర్ రావు కొనసాగారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ క్యాబినెట్ లో కరీంనగర్ నుంచి బిజెపి ఎంపీగా రెండవసారి గెలిచిన బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అయ్యారు.

నాడు హోం మంత్రి ఎల్ కె అద్వానీ కి వెన్నుదన్నుగా హోం శాఖ సహాయ మంత్రిగా విద్యాసాగర్ రావు నిలిచారు. నేడు హోం శాఖ మంత్రి అమిత్ షా కు అండగా బండి సంజయ్ నిలుస్తున్నారు. అప్పుడు విద్యాసాగర్ రావు రెండుసార్లు ఎంపీగా గెలిచి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అయ్యారు. ఇప్పుడు బండి సంజయ్ సైతం రెండుసార్లు ఎంపీగా గెలుపొంది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కావడం కాకతాళీయంగా మారింది.

కార్మిక శాఖ మంత్రులైన కాకా, కేసిఆర్

బిజెపి నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి పదవులు పొందితే, ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన గడ్డం వెంకటస్వామి(కాక) కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన కేసిఆర్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.‌ 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయకగా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయ్యారు. ఆ పదవిలో కెసిఆర్ రెండేళ్ల పాటు కొనసాగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసిఆర్ 2006లో మంత్రి పదవి తోపాటు ఎంపి పదవికి రాజీనామా చేసి యుపిఎ సర్కార్ నుంచి బయటకు వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు గెలిచిన జి.వెంకటస్వామి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1969 నుంచి 71 వరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. ఆ తరువాత కార్మిక శాఖ మంత్రిగా పని చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు.

కొత్త రాష్ట్రంలో కరీంనగర్ నుంచి తొలి కేంద్ర మంత్రి సంజయ్

సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కరీంనగర్ నుంచి తొలి కేంద్రమంత్రి అయ్యారు బండి సంజయ్ కుమార్. రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్ళకు, 20 ఏళ్ళ తర్వాత కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ కు దక్కడం విశేషం. ఇక పాతికేళ్ళ తర్వాత కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి పదవి కరీంనగర్ దక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి జిల్లా నుంచి తొలి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ పేరు చిరస్థాయిగా చరిత్ర పూటల్లో నిలిచిపోనుంది.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా)

Whats_app_banner

సంబంధిత కథనం