Sircilla : పొట్టి శ్రీరాములు చేసిన తప్పేంది? ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు పేర్లను తొలగించే దమ్ముందా? : బండి సంజయ్-bandi sanjay fires on revanth reddy over telugu university name change ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sircilla : పొట్టి శ్రీరాములు చేసిన తప్పేంది? ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు పేర్లను తొలగించే దమ్ముందా? : బండి సంజయ్

Sircilla : పొట్టి శ్రీరాములు చేసిన తప్పేంది? ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు పేర్లను తొలగించే దమ్ముందా? : బండి సంజయ్

Sircilla : తెలుగు యూనివర్సిటీకి సంబంధించి.. పొట్టి శ్రీరామలు పేరును తొలగించడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. పొట్టి శ్రీరాములు చేసిన తప్పేందని నిలదీశారు. ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు పేర్లను తొలగించే దమ్ముందా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు.

కేంద్రమంత్రి బండి సంజయ్

ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు పేర్లను తొలగించే దమ్ముందా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. దమ్ముంటే సీఎం రేవంత్ తన సవాల్‌పై స్పదించాలని డిమాండ్ చేశారు. పొట్టి శ్రీరాములు చేసిన తప్పేందని నిలదీశారు. ఆయన దేశ భక్తుడు, స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు పోయినోడు అని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బండి సంజయ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

వీరి పేర్లు తొలగిస్తారా..

'పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు పోయినోడు. హరిజనులను ఆలయాల్లోకి ప్రవేశం కల్పించాలని ఉద్యమించి శాసనం చేయించినోడు. శ్రీరాములు లాంటోళ్లు 10 మంది ఉంటే ఎప్పుడో స్వాతంత్ర్యం తెచ్చేటోడినని అన్నారంటే ఆయన గొప్పతనం అర్ధం చేసుకోవాలి. అట్లాంటి నేత పేరును తొలగించి అవమానిస్తారా? ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరామలు పేరు తొలగించారు. మరి ఆ మూలాలున్న ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి పేరిట అనేకం ఉన్నాయి. వారి పేర్లను కూడా తొలగిస్తారా?' అని సంజయ్ ప్రశ్నించారు.

శ్రీలంకలా మారుస్తున్నారు..

'కష్టపడే కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంటాం. తెలంగాణను కాంగ్రెస్ శ్రీలంకలా మారుస్తోంది. రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన కొనసాగుతోంది. 15 నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పు చేసి.. ప్రజలపై భారం మోపుతోంది. రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు భారం మోపబోతున్నారు. బీజేపీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నయ్. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు' అని సంజయ్ ఆరోపించారు.

లెక్కలు తేలుస్తాం..

'అర్బన్ నక్షల్స్ చేతిలో కులగణన డేటా ఉంది. 15 నెలల్లో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేస్తారా? బీజేపీ అధికారం లోకి రాగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ లెక్కలు తెలుస్తాం. రైతు భరోసా, రుణమాఫీ పైసలన్నీ ఇస్తేనే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలకు రూ.2500 ఇస్తేనే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అవినీతిరహిత పాలన చేస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అట్లాకాకుండా అవినీతి, అరాచక పాలన చేస్తూ.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి బ్రాండ్ ఇమేజ్ పేరుతో లేనిపోని కార్యక్రమాలు నిర్వహిస్తే ఏ విధంగా ఇమేజ్ పెరుగుతుంది?' అని బండి ప్రశ్నించారు.

అన్ని కేంద్రం ఇచ్చినవే..

'తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోంది. ఇవాళ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతుంది. రాష్ట్రం నయాపైసా ఇస్తలే. అయినా తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని ఎదురుదాడి చేస్తున్నరు. అన్నీ మేమే ఇస్తే.. ఇగ మీరెందుకు? తప్పుకోండి. డబుల్ ఇంజన్ సర్కార్ తో తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేస్తామో చేతల్లో చూపిస్తాం. తెలంగాణలోని ఏ గ్రామానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో.. గ్రామాల వారీగా సమగ్ర వివరాలను అందజేస్తాం. గ్రామాల్లోకి కరపత్రాలు, ఫ్లెక్సీలు వేస్తాం' అని సంజయ్ స్పష్టం చేశారు.

కారు.. హస్తం ఒక్కటే..

'బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. రెండు పార్టీలు డ్రామాలాడుతున్నయ్. బీఆర్ఎస్ చేసిన స్కాంల్లో కాంగ్రెస్ అరెస్ట్ కాకుండా కాపాడుతోంది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఫార్ములా ఈ రేసు, భూముల కుంభకోణం, కాళేశ్వరం సహా అన్ని స్కాముల్లో కేసీఆర్ కుటుంబం ఉందని తెలిసినా.. అరెస్ట్ చేయలే. కనీసం నోటీసులు కూడా ఇచ్చే దమ్ము లేకపాయే. కనీసం కేసీఆర్ ను విచారణకు పిలిచే దమ్ము లేకపాయే. ఎందుకంటే రెండు పార్టీలూ ఒక్కటే' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Basani Shiva Kumar

eMail