Bandi Sanjay : రుణమాఫీ, ఆరు గ్యారంటీలపై చర్చను డైవర్ట్ చేయడానికే విగ్రహాల లొల్లి- బీఆర్ఎస్, కాంగ్రెస్ పై బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay : రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ విగ్రహాల లొల్లి చేస్తు్న్నాయి బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలకు కావాల్సింది విగ్రహాల లొల్లి కాదన్నారు. రుణమాఫీ, ఆరు గ్యారంటీ స్కీమ్ ల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay : రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీ స్కీమ్ ల హామీలపై చర్చను డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్ విగ్రహాల లొల్లి సృష్టిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల సవాల్ ప్రతి సవాల్ ప్రజల దృష్టిని మళ్లించడానికేనని విమర్శించారు. ప్రజలకు కావాల్సింది విగ్రహాల లొల్లి కాదన్నారు. రుణమాఫీ, ఆరు గ్యారెంటీ స్కీమ్ ల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో విగ్రహాల లొల్లి హాట్ టాపిక్ గా మారడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ వైఖరిపై తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ నేత కేటిఆర్ కూల్చుతామని, ముట్టుకుని చూడు అని సీఎం రేవంత్ రెడ్డి అనడం ఆ రెండు పార్టీల వైఖరేమిటో అర్థం అవుతుందన్నారు. డైలాగ్ వార్ కేవలం ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లించడానికేనని బండి స్పష్టం చేశారు. ప్రజలకు ప్రస్తుతం కావాల్సింది విగ్రహాలు కాదన్నారు. రైతులు రుణ మాఫీ కాక, రైతుబంధు అందక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆందోళనలో ఉంటే ఆ విషయాలను పట్టించుకోకుండా విగ్రహాల లొల్లితో అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పుట్టగతులు లేకుండా పోతాయని విమర్శించారు.
రైతు రుణమాఫీ బోగస్
రైతుల రెండు లక్షల వరకు రుణమాఫీ బోగస్ అని బండి సంజయ్ విమర్శించారు. అసలు రైతులు ఎంతమంది రుణాలు తీసుకున్నారు. ఎన్ని కోట్లు అవసరమో, సరైన లెక్కలు చెప్పకుండా మొక్కుబడిగా కొందరి రుణాలు మాఫీ చేసి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ లెక్కలు స్పష్టం చేసి ఆరు గ్యారంటీ స్కీమ్ ల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతోనే అభివృద్ధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని వాటిని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. విపక్షత లేకుండా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చూడాలని ఆదేశించారు.
రిపోర్టింగ్: కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్
సంబంధిత కథనం