Paper Leak Case : ఆయనకెందుకు నోటీసులివ్వలేదు..? నిరుద్యోగ మార్చ్ చేస్తామన్న బండి సంజయ్ -bandi sanjay fires brs govt over tspsc paper leak case
Telugu News  /  Telangana  /  Bandi Sanjay Fires Brs Govt Over Tspsc Paper Leak Case
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (twitter)

Paper Leak Case : ఆయనకెందుకు నోటీసులివ్వలేదు..? నిరుద్యోగ మార్చ్ చేస్తామన్న బండి సంజయ్

22 March 2023, 15:56 ISTHT Telugu Desk
22 March 2023, 15:56 IST

Bandi Sanjay Fires BRS Govt: మిలియన్ మార్చ్ తరహాలో త్వరలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ కొడుకు రాజీనామా చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే అని డిమాండ్ చేశారు.

Bandi Sanjay TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దోషుల అంతు చూసే వరకు బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా మిలియన్ మార్చ్ తరహాలో త్వరలోనే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామన్నారు. ఈ విషయంపై పార్టీ నేతలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. పేపర్ లీకేజీ కారకుడైన కేసీఆర్ కొడుకు రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేవరకు పోరాడతామన్నారు. నిరుద్యోగులెవరూ నిరాశపడొద్దని బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యూపీఎస్పీ తరహాలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకల అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

"సిట్ నోటీసులు నాకు అందలేదు. అసలు సిట్ విచారణకే మేం వ్యతిరేకం. ఎందుకంటే కేసీఆర్.. సిట్ అంటే సిట్. స్టాండ్ స్టాండ్. నయీం డైరీ, మియాపూర్ భూములు, డ్రగ్స్, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య సహా పలు కేసులపై విచారణ చేసిన సిట్ నివేదికలు ఏమయ్యాయి. అసలు నోటీసులు ఇవ్వాల్సి వస్తే తొలుత కేసీఆర్ కొడుకుకే నోటీసులు ఇవ్వాలి. ఆయనకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు? ప్రతిపక్షాలుగా మాకు ప్రజల నుండి వచ్చే సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడతాం.. నోటీసుల పేరుతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు. నిర్మల్ లో విపరీతమైన భూ కబ్జాలకు పాల్పడుతూ, సఫాయి కార్మికుల నుండి పైసలు తీసుకునే ఓ మంత్రి పేపర్ లీకేజీ సర్వసాధారణమంటున్నాడు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టేలా లీకేజీ చేస్తే సర్వసాధారణమా? బీఆర్ఎస్ పార్టీలో రెస్ట్ లో ఉంది. అమావాస్య, పున్నమి సమయంలో లేచి మా పార్టీ మనుగడలో ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. సీనియర్ జర్నలిస్టుల తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్, సతీష్ కమాల్, సుదర్శన్ గౌడ్ అరెస్ట్ దుర్మార్గం. వాళ్లను ఎందుకు అరెస్ట్ చేశారు. తప్పు చేస్తే కేసు పెట్టాలే తప్ప అర్ధరాత్రి దొంగల్లా వచ్చి ఎత్తుకెళ్లడమేంది..? తీన్మార్ మల్లన్న, సుదర్శన్ గౌడ్, విఠల్, సతీష్ కమాల్ వంటి వారిని చూస్తేనే కేసీఆర్ లో వణుకు పుడుతోంది. అందుకే భయపడి అరెస్ట్ చేస్తోంది" అని ఆరోపించారు.

కేసీఆర్ పాలనలో నిర్బంధాలు, అరాచకాలు పెరిగాయని ఆరోపించారు బండి సంజయ్. మీడియా సంస్థలపైనా దాడులు చేసే ప్రమాదముందన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తాం... పీడీ యాక్ట్ పెడతామనే బెదిరింపుల్లో భాగమే సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ అని అన్నారు. "మీడియా సంస్థలను బెదిరిస్తున్నారు. తన కబంధ హస్తాల్లో పెట్టుకునే యత్నం చేస్తున్నారు. మీడియా సంస్థలంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. జర్నలిస్టుల అరెస్ట్ పై స్పందించకపోతే... ఇతర మీడియా సంస్థలపైనా కేసులు పెట్టే ప్రమాదముంది. ఐక్యంగా పోరాడాలి. ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కోర్టును ఆశ్రయిస్తాం... న్యాయపరంగా, చట్టపరంగా పోరాడతాం. కేసీఆర్ తెలంగాణ కోసం అటుకులు బుక్కి పోరాడలేదు. వేల కోట్లు సంపాదించిన దుర్మార్గుడు . ఇయాళ కేసీఆర్ నిర్వాకంవల్ల తెలంగాణ ప్రజలు తిండిలేక అల్లాడుతున్నారు. స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. ప్రభుత్వం పక్షాన పనిచేయాల్సిన తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వోకేట్ జనరల్ కేసీఆర్ బిడ్డను కాపాడటానికి ఢిల్లీకి వెళ్లి ఈడీని ఎట్లా కలుస్తారు? ఆయన కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తున్నారా? ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నాం. బార్ కౌన్సిల్ లో ఫిర్యాదు వేస్తాం. న్యాయపరంగా పోరాడతాం" అని స్పష్టం చేశారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారకుడు ట్విట్టర్ టిల్లునే అంటూ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేశారు బండి సంజయ్. "ఆయన ఎందుకు రాజీనామా చేయడు? కేసీఆర్ ఎందుకు బర్తరఫ్ చేయడు? తెలంగాణ మీ కుటుంబ గుత్తాధిపత్యం అనుకుంటున్నవా..? ప్రశ్నించే మీడియాను అణిచివేస్తున్నారు. మల్లన్న అరెస్ట్ శాంపిల్ మాత్రమే... తమను ప్రశ్నించే వాళ్లను, తప్పులను ఎత్తిచూపేవాళ్లను లోపలేస్తామని వార్నింగ్ ఇవ్వడంలో భాగమే మల్లన్న అరెస్ట్. పొరపాటున కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజలు చెప్పులు నెత్తిన పెట్టుకోవాల్సిన దుస్థితి. తెలంగాణ ఉద్యమకారులారా.... పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరినీ వేధిస్తున్నారు. జర్నలిస్టులసహా అందరిపై కేసులు పెడుతున్నారు. ఇంకెన్నాళ్లు ఇంట్లో కూర్చుందాం? మళ్లీ నిజాం పాలన గుర్తుకొస్తుంది. మీరంతా బయటకు రండి... బీజేపీ అండగా ఉంటుంది. నిరుద్యోగులారా.... మీరంతా బీజేపీ చేసే పోరాటాలకు మద్దతివ్వండి. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం. పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాల్సిందే. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే. నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలి. అతి త్వరలో నిరుద్యోగ యువత కోసం మిలియన్ మార్చ్ తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇందుకోసం పార్టీ నేతలందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం" అని సంజయ్ చెప్పారు.

సంబంధిత కథనం