Praja Sangrama Yatra: రేపటి నుంచి బండి సంజయ్ 'ప్రజా సంగ్రామ యాత్ర'…షెడ్యూల్ ఇదే
Bandi Sanjay Praja Sangrama Yatra: నవంబర్ 28 నుంచి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) చేయనున్నారు. ఐదో విడత కింద చేయనున్న ఈ యాత్ర భైంసా నుంచి ప్రారంభం కానుంది.
Bandi Sanjay Fifth Phase Praja Sangrama Yatra: రాష్ట్రవ్యాప్తంగా పలు విడతల్లో పాదయాత్ర చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తి చేసిన ఆయన... తాజాగా ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర సిద్ధమయ్యారు. ఇక ఈ పాదయాత్ర రేపటి (నవంబర్ 28) నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రూట్ మ్యాప్ ఖరారైంది.
ఐదో విడత పాదయాత్ర భైంసా నుంచి కరీంనగర్ వరకు కొనసాగుతుంది. 3 నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. ఇదిలా ఉంటే భైంసాలో రేపటి ప్రారంభ సభకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస హాజరుకానున్నారు. ఈ పాదయాత్ర నిర్మల్, ఖానాపూర్, వేముల వాడ, జగిత్యాల, చొప్పదండి మీదుగా సాగి కరీంనగర్ లో ముగింపు సభ ఉంటుంది. మరోవైపు పాదయాత్ర కోసం ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యలను తెలుసుకునేమందుకు బండి సంజయ్ ఇప్పటివరకు నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తి చేశారు. 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 21 జిల్లాల్లో 1100 కి. మీటర్లకు పైగా నడిచారు. ఇదే సమయంలో ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర కూడా చేస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీ ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే విధంగా బీజేపీ ముందుకెళ్తోంది. మునుగోడులో రెండు స్థానంలో నిలవటంతో పాటు కేవలం 10వేల ఓట్లతో ఓడిపోయింది. ఫలితంగా అధికార టీఆర్ఎస్ ను అన్నివిధాల ఎదుర్కొనే పార్టీ తమదే అని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలను పార్టీలోకి తీసుకుంది. తాజాగా కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కమలం గూటికి చేరారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని కూడా కమలం నేతలు లీక్ లు ఇస్తున్నారు.