Bandi Sanjay : తక్షణమే పీఆర్సీపై నిర్ణయం తీసుకోండి.. లేకుంటే ఉద్యమమే !
Bandi Sanjay : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతన సవరణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అన్నారు. లేని పక్షంలో బీజేపీ భారీ ఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ రాశారు.
Bandi Sanjay : తక్షణమే వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి.. పెరిగిన ధరలకు అనుగుణంగా జూలై 1 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు. ఉద్యోగులకి ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. మార్చి 9న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో.. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానమైన వేతన సవరణ సంఘం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు... బీఆర్ఎస్ పాలనలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించకుండా.. ఉద్యోగుల హక్కులని కాలరాస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కావడం లేదన్నారు బండి సంజయ్. స్వరాష్ట్రంలో తొలి పీఆర్సీ అమలులో జాప్యం వల్ల.. ఎంప్లాయిస్ 21 నెలల పాటు పెంచిన జీతాన్ని నష్టపోయారని లేఖలో గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్ 30తో మొదటి పీఆర్సీ గడువు ముగిసిపోతుందని... 2023 జూలై 1 నుంచి కొత్త వేతన సవరణ అమల్లోకి రావాలని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు పీఅర్సీ కమిషన్ ను కూడా ప్రభుత్వం నియమించకపోవడం సహించరానిదని అన్నారు. ఇది ముమ్మాటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులను దగా చేయడమే అని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే... ఏదో విధంగా జాప్యం చేసి ఉద్యోగులకి పీఆర్సీ ఎగ్గొట్టాలనే ధోరణి కనిపిస్తోందని విమర్శించారు. మార్చి 9న జరగనున్న క్యాబినెట్ భేటీలో పీఆర్సీ ఏర్పాటుతో పాటు 3 నెలల్లో నివేదిక తెప్పించుకొని జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
రుణమాఫీ, ఉచిత యూరియా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, దళిత బంధు, దళితులకి మూడెకరాల భూమి, గిరిజన బంధు, చేనేత బంధు, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగా ఉన్న వారికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం వంటి హామీలను ఇంత వరకు ఎందుకు అమలు చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని.. అయినా ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం క్షమించరాని విషయమన్నారు. మంత్రివర్గ సమావేశంలో హామీల అమలుపై చర్చించి.. తగిన నిధులు కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయా హామీల అమలు కోసం ప్రజల పక్షాన బీజేపీ భారీ ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని... జరగబోయే పరిణామాలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.